breaking news
Madhav shivaraju
-
యోగి ఆదిత్యనాథ్ (యూపీ సీఎం) - రాయని డైరీ
‘‘యోగీజీ, రాష్ట్రంలో కొన్నాళ్లపాటు మీరిక ఎన్కౌంటర్లను ఆపేయాలి’’ అన్నారు అమిత్ షా... నేనాయన పక్కనే నడుస్తూ ఉన్నప్పుడు. గతవారం రామ్ మనోహర్ లోహియా ‘లా’ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిశాక, ఆ ప్రాంగణంలో ఇద్దరం కలిసి నడుస్తున్నాం.అమిత్ షాకు పక్కనున్నవారి భుజాల మీద చేయి వేసి నడుస్తూ మాట్లాడే అలవాటు లేదు కనుక, నేను కూడా ఆయన చేతులకు నా భుజాలు తాకనంత ఎడంగా నడుస్తూ ఆయనతో మాట్లాడుతున్నాను.నిజానికి, ఆయనతో కలిసి నడవటానికి నేను ఆయన పక్కకు వెళ్లలేదు. నాతో కలిసి నడవటానికి ఆయనే నా పక్కకు వచ్చారు! అలా ఇద్దరం కలిసి నడుస్తున్నప్పుడే, ‘‘యోగీజీ, రాష్ట్రంలో కొన్నాళ్లపాటు మీరిక ఎన్ కౌంటర్లు ఆపేయాలి’’ అన్నారు అమిత్ షా! నేను మౌనంగా ఉండిపోయాను.‘‘యోగీజీ, 2017లో మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు, ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 17,043 ఎన్ కౌంటర్లు జరిగాయని; సగటున చూస్తే రోజుకు 5 ఎన్ కౌంటర్లు, 12 రోజులకొక ఎన్కౌంటర్ ‘కిల్లింగ్’ అని– సరిగ్గా ఎన్నికలకు ముందు – పత్రికలు రాయటం మొదలుపెట్టాయి. కనుక కొన్నాళ్లు మీరు ఎన్ కౌంటర్లు ఆపేయటం అవసరం అనుకుంటున్నాను’’ అన్నారు అమిత్ షా.400కు పైగా ఎన్ కౌంటర్లతో ‘కగార్’ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయించిన ఒక హోమ్ మినిస్టర్... కొన్నాళ్లపాటు ఎన్ కౌంటర్లు ఆపేయమన్నారంటే... ‘కొన్నాళ్లు’ అనే మాటకే తప్ప, ‘ఎన్ కౌంటర్లు’ అనే మాటకు ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదు. మరో ఆర్నెల్లలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు. అమిత్ షా అంతక్రితమే కార్యవర్గ సమావేశంలో ఎన్నికల వ్యూహాన్ని ప్రకటించారు. 2027లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది మళ్లీ మన అభ్యర్థే అని అన్నారు.సమావేశంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ఉన్నారు. వాళ్లిద్దరూ ఉప ముఖ్యమంత్రులు కనుక వాళ్లలో ఒకరు యూపీకి కొత్త ముఖ్యమంత్రి కావచ్చు. సమావేశంలో ధర్మపాల్ సింగ్ ఉన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుక ఆయనా ముఖ్యమంత్రి అవొచ్చు. సమావేశంలో పంకజ్ చౌధరీ ఉన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఆయనా ముఖ్యమంత్రి కాకూడదనేం లేదు.సమావేశంలో వినోద్ తావ్డే ఉన్నారు. ఆయన రాష్ట్ర ఇంఛార్జ్ కనుక ముఖ్యమంత్రి ఎందుకౌతార్లే అనీ అనుకోవటానికి లేదు. అసలు వీళ్లెవరూ కాకుండా, మళ్లీ యోగీనే ముఖ్యమంత్రి కావచ్చని అనుకునేవాళ్లూ ఉండొచ్చు! అమిత్ జీ నా పక్కన నడుస్తున్నారు కనుక, మూడోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవటానికి నాకున్న తాజా అర్హత... అలా అమిత్ షా నా పక్కనే నడిచే అవకాశం నాకు రావటమేనని వారికి అనిపించవచ్చు.అమిత్ షా తిరిగి ఢిల్లీ బయలు దేరుతున్నప్పడు లక్నో ఎయిర్ పోర్ట్‌లో కూడా ఆయనా, నేను కలసి నాలుగడుగులు నడిచాం. ఆ సమయంలో ఆయనా మాట్లాడలేదు, నేనూ మాట్లాడలేదు. మాట్లాడని ఇద్దరు మనుషుల మధ్య సాగే ‘సంభాషణ’ అపారమైనదిగా, అర్థవంతమైనదిగా ఉంటుంది.అమిత్ షా మనసులో ఉన్నదేమిటో నాకు తెలుస్తూనే ఉంది. అక్టోబర్ 23న జరిగిన 11 ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ 6, సమాజ్‌వాదీ పార్టీ 5 సీట్లు గెలిచినా... వారణాసి పట్టభద్రుల సీటు, వారణాసి టీచర్ల సీటు బీజేపీకి రాలేదు. అవి రెండూ మోదీజీ నియోజకవర్గంలోనివి.2024 లోక్‌సభ ఎన్నికల్లో 29 సీట్లు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 57 సీట్లు తగ్గటం కూడా అమిత్ షా మనసులో బలంగా ఉంది. ఆ తగ్గుదల 2027కు, 2029కి కొనసాగకూడదనుకుంటే, నేను కొన్నింటిని తగ్గించవలసి ఉంటుంది. లేదా, పూర్తిగా ఆపేయవలసి ఉంటుంది. అమిత్ షా చెప్పినట్లు అవి ఎన్కౌంటర్లైనా, బుల్డోజర్లైనా!!- మాధవ్ శింగరాజుఇదీ చదవండి: నూరు వసంతాల భారతరత్నం -
కె.చంద్రశేఖర్‌రావు రాయని డైరీ
మాధవ్ శింగరాజు చాయ్ కప్పులు ఎన్ని తాగినా సరిపోతలె. పాపం శోభ అప్పటికీ పెద్ద పెద్ద కప్పులల్ల చాయ్‌ల మీద చాయ్‌లు పంపిస్తనే ఉంది. నిన్న రాత్రి కూడా ఎప్పట్లెక్కనె చాయ్‌లు తాగుతూ తెల్లార్లూ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూర్చున్న. కంప్యూటర్ల టీఎంసీల కొద్దీ డేటా ఉన్నది. మొత్తం స్టడీ చేశిన. అడవులకు అడ్డుపోకుండా, చంద్రబాబు అడ్డురాకుండా, ఇంటర్‌స్టేట్ క్లియరెన్స్ అవసరం లేకుండా కొత్త రూట్ల కోసం దేవులాడిన. బంగారు తెలంగాణ ముందుగాల నీల్లతోనే కదా అస్తది. తర్వాత కరెంటు, తర్వాత పచ్చటి పొలాలు, తర్వాత స్కై వేస్, తర్వాత తెలంగాణ ముద్దు బిడ్డలకు స్వేచ్ఛా వాయువులు. నీరు, నిప్పు, నింగి, నేల, గాలి! పంచభూతాలను దారిలోకి తెచ్చుకుంటె బంగారు తెలంగాణ రాకపోతదా. అప్పుడింక తెలంగాణ అంతా బంగారమే కాకపోతదా. సెట్లర్లకు కూడా దసరా దసరాకి ఇంత బంగారం ఇస్తే ఏంబోతది. పర్మనెంట్ టూరిస్టు ఉన్నడు కదా... చంద్రబాబు. ఆయనకి కూడా అలయ్‌బలయ్ అనుకుంట ఇంత బంగారం ఇస్తే కాదంటడా. వద్దు పొమ్మంటడా. ఇంటున్న కదా, చంద్రబాబు గీ మజ్జె ఒక కథ చెప్పబట్టె. గాయన తెలంగాణ టూర్‌కి వచ్చినప్పుడు ఒకామెను చూసిండంట. ఆమె ఎనకాలే ఒక గొర్రె పోతుండడం కూడా చూసిండంట. అప్పుడు ఆమెను అడిగిండంట, ‘‘ఆ గొర్రెందుకు నీ వెనకాలే వస్తోంది’’ అని. అప్పుడామె చెప్పిందట, ‘‘ఎప్పుడో గింత మేత ఏసినా సారూ. అందుకే అత్త్తంది’’ అన్నదట. ‘‘నేను వేసినా నా వెనకాల వస్తుందా’’ అని చంద్రబాబు అడిగిండంట. ‘‘అట్లెందుకస్తది. సిన్నప్పట్నుంచి ఎయ్యాలే మేత’’ అన్నదట ఆమె. అప్పుడాయన ‘‘ఈ గొర్రెలకున్న విశ్వాసం కూడా నా ఎమ్మెల్యేలకు లేకపోయెనే’’ అని బాధపడిపోయిండట. చంద్రబాబు ఎమ్మెల్యేలను గొర్రెలనుకుంటున్నడో ఏమో! గీ దినంతో ఉత్సవాలు ముగుస్తున్నయ్. ముహుర్తం కూడా మంచిగనే జరిగింది. చంద్రబాబు జూన్ రెండో తారీఖున హైద్రాబాద్ వదలిపెట్టి విజయవాడ పోయిండు. ఇంక తెలంగాణలో సంబురాలు షురూ కావా! విజయవాడ నుంచి సర్కారును నడిపించుకుంటడంట. ఏణ్ణుంచైనా నడిపించుకోనీ. ఈణ్ణుంచి కాకుండా. చంద్రబాబు పెద్ద క్యాపిటలిస్టు. జపాన్ పోతడు. అమరావతిని మీ సెకండ్ క్యాపిటల్ అనుకోండి అంటడు. సింగపూర్ పోతడు. అక్కడా అదేమాట అంటడు. ఆయనకు మాత్రం సింగపూర్ రెండో క్యాపిటల్ కావాలె. పొద్దున లేస్తే చంద్రబాబు గానీ, గాయన మంత్రులు గానీ, ఆఫీసర్లు గానీ ఏడికి పోవాలె. అమరావతి పోవాలె. మరి ఏడికి పోతుండ్రు. సింగపూర్ పోతుండ్రు. ఎమ్మెల్యేలు యాష్టకొచ్చి టీఆర్ఎస్లోకి వస్తుండ్రు. దీంట్ల మా తప్పేముంది? రుతుపవనాలు వస్తుంటే వద్దంటమా!!


