‘చంపారన్‌’ ఓ చుక్కాని..!

‘చంపారన్‌’ ఓ చుక్కాని..! - Sakshi


త్రికాలమ్‌



చర్విత చర్వణమే అయినా కొన్ని విషయాలు పదేపదే ప్రస్తావించవలసి వస్తుంది. జనాభాలో అధిక సంఖ్యాకుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సమస్య ఏళ్ళూపూళ్ళూ గడిచినా పరిష్కారానికి నోచుకోకపోతే అదే సమస్యను పాలకుల దృష్టికి మళ్ళీమళ్ళీ తీసుకురాక తప్పదు. రైతు ఆత్మహత్య వార్త లేకుండా ఒక్క రోజైనా గడవదంటే అతిశయోక్తి కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల బలవన్మరణాలకు సంబంధించిన వార్తలు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి. శనివారం తెలంగాణలోని గద్వాల జోగులాంబ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.



1998 నుంచి సాగుతున్న ఈ బలవన్మరణ పరంపరను నిలువరించడానికి గట్టి ప్రయత్నం ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. ఎంత మంది ఎన్ని విజ్ఞప్తులు చేసినా పార్లమెంటులో కానీ చట్టసభలలో కానీ ఈ సమస్యను చర్చించి పరిష్కరించే కృషి జరగలేదు. అఖిలపక్ష సమావేశం జరగలేదు. వ్యవసాయదారుల ప్రతినిధులతో, శాస్త్రవేత్తలతో, సామాజిక సేవకులతో ప్రభుత్వాలు సమావేశాలు నిర్వహించి ఈ అంశాన్ని చర్చకు పెట్టి అభిప్రాయాలు సేకరించలేదు. రైతు మరణ వార్తలు క్రమం తప్పకుండా రావడంతో సమాజంపైన వాటి ప్రభావం తగ్గిపోతోంది. మీడియా సైతం కలత చెందడం, ఆవేదన వెలిబుచ్చడం తగ్గుతూ వచ్చింది. విపణి ఆధారిత ఆర్థిక విధానాలను విశ్వసించే పత్రికలూ, టీవీ చానళ్ళూ రైతుల మరణాలకు సంబంధించిన వార్తలను ముట్టుకోవడం లేదు.



ఓటు బ్యాంక్‌గా పరిగణించినా సరే...

అయినా సరే, రైతును విస్మరించడానికి వీలు లేదు. జనాభాలో దాదాపు 60 శాతం ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. ఓటు బ్యాంకుగా చూసినా అది చాలా విలువైనది. ఈ సంగతి పాలకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 2014లో కేంద్ర అధికార పీఠం అధిష్ఠించిన ఎన్‌డీఏ కానీ తెలంగాణలోని పాలకపక్షం టీఆర్‌ఎస్‌ కానీ, ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తున్న తెలుగుదేశం–బీజేపీ కూటమి కానీ రైతు సంక్షేమం కోసం ఏయే చర్యలు తీసుకున్నదీ ఏకరవు పెడుతున్నాయి.



ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే కావచ్చు. ఫలితం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభం కారణంగా కాదనీ, ఇతర కారణాల వల్ల అనీ మనల్ని మనం మభ్యపెట్టుకోవడం ఆత్మవంచన. ఇతరులను దబాయించడం పరవంచన. గజం మిథ్య, పలాయనం మిథ్య అనేది వాదనకు నిలబడదు. సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం, సమస్య పరిష్కారమయ్యే వరకూ కృషిని కొనసాగించడం ఒక్కటే మార్గం. 1998 నుంచి ఇప్పటి వరకూ దేశంలోనూ, రాష్ట్రాలలోనూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎంతో కొంతకాలం అధికారంలో ఉన్నాయి. ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలూ ప్రభుత్వాలు నిర్వహించాయి. కానీ ఎవరూ ఆయన సూచనలను అమలు చేయడానికి ప్రయత్నించలేదు.



రైతులను ఆదుకోవడం కోసం రైతు సమన్వయ సమితుల (ఆర్‌ఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తున్నామనీ, వాటికి చట్ట హోదా కల్పించే ఆలోచన కూడా ఉన్నదనీ తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌లను తక్షణం ఏర్పాటు చేయాలని మంత్రులకూ, ఎంఎల్‌ఏలకూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ సంస్థలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదనీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కమిటీలలో టీడీపీ కార్యకర్తలను నియమించి సకల సంక్షేమ, ప్రభుత్వ కార్యక్రమాలు వారి సూచనల మేరకే చేస్తున్నట్టు తెలంగాణలో కూడా చేద్దామని కేసీఆర్‌ చూస్తున్నారని కాంగ్రెస్‌ నాయకుల విమర్శ. పోటీగా రైతు రక్షణ సమితులను నియమిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఇదంతా ఉపరితల రాజకీయ విన్యాసమే కానీ అసలు సమస్యను పరిష్కరించే కసరత్తు కాదు.



కాంగ్రెస్‌ నాయకులు తమ పార్టీ చరిత్రనూ, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన చంపారన్‌ ఉద్యమాన్ని అధ్యయనం చేస్తే ఇప్పుడు కర్తవ్యం ఏమిటో వారికి బోధపడుతుంది. నవభారత నిర్మాత జవహర్‌లాల్‌ నెహ్రూ గత మూడేళ్ళుగా విస్మృతిపథంలో పడిపోయారు. కొత్త తరాలకు నెహ్రూ అంటే తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. గాంధీకి సైతం అదే దుస్థితి పట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీని కానీ, బీజేపీ భావజాలాన్ని కానీ నిందించి ప్రయోజనం లేదు. గాంధీ, నెహ్రూల ప్రాసంగికత తగ్గిపోవడానికి ప్రధాన కారకులు ఈ తరం కాంగ్రెస్‌ నాయకులే. వారికే గాంధీ జీవితం తెలియదు. నెహ్రూ చరిత్ర తెలియదు. గాంధీ, నెహ్రూలను విస్మరించిన కాంగ్రెస్‌కు నిష్కృతి ఏముంటుంది? ఈ ఇద్దరూ శిఖర సమానులైన నాయకులు కనుక వారిని గుర్తు పెట్టుకోవాలని చెప్పడం లేదు. నేటి సమస్యలకు పరిష్కారాలు వారి ఆచరణలో కనిపిస్తాయి.



రైతుల జీవితాలలో వెలుగు నింపడం ఎట్లాగో, కనీసం చీకటిని తొలగించడం లేదా తగ్గించడం ఎట్లాగో తెలుసుకోవాలంటే గాంధీజీ 1916–17లో నిర్వహించిన చంపారన్‌ ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి. ఇది చంపారన్‌ శతవార్షికోత్సవ సందర్భం. సరిగ్గా వందేళ్ళ కిందట గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఫలి తంగా చంపారన్‌ నీలిమందు రైతులకు ఊరట లభించింది. ఈ తరం యువతకు చంపారన్‌ ఉద్యమాన్ని పరిచయం చేసేందుకు శాసనసభ మాజీ సభ్యుడు పి. జనార్దనరెడ్డి చొరవతో చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. దానిని ఆగస్టు 15 ఆవిష్కరించారు. చంపారన్‌ ఉద్యమం గురించి గాంధీ, ఆచార్య కృపలానీ, ఇర్ఫాన్‌ హబీబ్, గాంధీ మనుమడు తుషార్‌గాంధీల రచనలను సేకరించి గౌరవ్‌ చేత అనువదింపజేశారు.



స్వదేశంలో గాంధీ తొలి ఉద్యమం

దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన అనంతరం గాంధీ తలపెట్టిన మొదటి పెద్ద ఉద్యమం చంపారన్‌ పోరాటం. ఇది రష్యా విప్లవం కంటే ముందు జరిగింది. 1916లో లక్నోలో ఏఐసీసీ సభలు జరుగుతున్న సమయంలో బిహార్‌ నుంచి రైతు నాయకుడు రాజ్‌కుమార్‌ శుక్లా గాంధీని కలుసుకొని తమ ప్రాంతంలో నీలిమందు రైతుల దుస్థితిని పరిశీలించవలసిందిగా కోరాడు. అతని కోరిక మన్నించి చంపారన్‌ వెళ్ళిన గాంధీ రైతుల పరిస్థితిని అధ్యయనం చేశాడు. నీలిమందును వస్త్రాల తయారీలో, అద్దకంలో ఉపయోగిస్తారు. యూరప్‌లో దీనికి గిరాకీ ఎక్కువ. బెంగాల్‌ బ్రిటిష్‌వారి అధీనంలోకి రాగానే నీలిమందు పండించాలని రైతులపైన ఒత్తిడి తెచ్చారు. ఇది బిహార్‌కు పాకింది. రైతుల నుంచి నీలిమందును కారు చౌకగా కొని విదేశాలకు ఎగుమతి చేసేవారు తెల్లదొరలు. కానీ 1880లో జర్మనీలో సింథటిక్‌ అద్దకం వృద్ధి కావడంతో నీలిమందు గిరాకీ పడిపోయింది. యజమానుల ఆదాయం తగ్గింది. రైతుల మీద సుంకాలూ, జరిమానాలూ పెంచారు. తెల్లవారు నేరుగా రైతులను హింసించకుండా జమీందారీల ద్వారా, వారు నియమించిన టేకేదార్ల ద్వారా పీడించేవారు.



నీలిమందు నేల సారాన్ని పూర్తిగా పీల్చి పిప్పిచేస్తుంది. కానీ మొత్తం ఇరవై భాగాలలో మూడు భాగాలు విధిగా నీలిమందు సేద్యానికి కేటాయించాలని నిర్దేశించే ‘తీన్‌కఠియా రివాజు’ను ప్రభుత్వం రుద్దింది. ఈ నిబంధన దాదాపు వందేళ్ళుగా అమలులో ఉంది. తవాన్‌ పేరుతో పరిహారం వసూలు చేసేవాళ్ళు. జిరాత్‌ పేరుతో అధిక మొత్తంలో సుంకం విధించేవాళ్ళు. అబ్‌వాక్‌ పేరుతో అక్రమ జరిమానాలు వసూలు చేసేవారు. బిగార్‌ పేర రైతుల ఎడ్లనూ, వ్యవసాయ పనిముట్లనూ అప్పనంగా వినియోగించుకునేవారు. ఈ దుస్థితిపైన దాదాభాయ్‌ నౌరోజీ, ఆర్‌సి దత్‌లు పుస్తకాలు రాశారు. నీలిమందు రైతుల సమస్య పరిష్కారం అయ్యేవరకూ గాంధీ మరో పని తలపెట్టలేదు. ఆయన సమాచారం సేకరిస్తున్నానంటూ రైతుల మధ్య ఉన్నారు. తనతో పాటు అనేకమంది వలంటీర్లను రంగంలోకి దిం పారు. అనేకమంది న్యాయవాదులు ఆయనకు అనుచరులుగా మారారు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ కార్యక్రమాలు కానీ గాంధీ చేయలేదు. రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరించారు. మొత్తం 8,000 మంది నీలిమందు రైతులు తమ ఫిర్యాదులను గాంధీకి అందజేశారు. గాంధీ ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. రైతులు గాంధీ నాయకత్వంలో సంఘటితం అవుతున్నారనే అనుమానం తెల్లదొరలకు కలిగింది. జిల్లా వదిలి వెళ్ళిపోవాలని 1917 ఏప్రిల్‌ 16న జిల్లా అధికారి గాంధీని ఆదేశించారు. 18న జిల్లా న్యాయాధికారి ఎదుట నిందితుడుగా నిలబడిన గాంధీ ధిక్కార స్వరం వినిపించారు. తాను వచ్చిన పని పూర్తి చేయకుండా చంపారన్‌ వదిలి వెళ్ళేది లేదని ప్రస్ఫుటంగా చెప్పారు.



దిగివచ్చిన సర్కార్‌

ప్రభుత్వం నీలిమందు రైతుల సమస్యను అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని నియమించింది. ఇందులో గాంధీకి సభ్యత్వం ఇచ్చింది. రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాలనూ, అమానవీయమైన వేధింపులనూ వివరించే సమాచారాన్ని గాంధీ అప్పటికే సేకరించారు. ఆ సమస్త సమాచారాన్ని కమిటీ ఎదుట సమర్పించారు. ప్రభుత్వ ఉన్నతాధికారి డబ్లు్య మౌడీతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించలేదు. తాను చట్టాన్ని గౌరవిస్తున్నాననీ, నీలిమందు రైతులకు సాయపడటానికే వారి నుంచి సమాచారం సేకరిస్తున్నాననీ గాంధీ వివరించారు. ప్రభుత్వమే దిగి వచ్చింది. గాంధీకి తోడ్పడవలసిందిగా అధికారులను ఉన్నతాధికారి ఆదేశించారు. దీంతో ఖంగు తిన్న జమీందారులు మొదట రైతులను బెదిరించారు. తర్వాత రాజీ కోసం ప్రయత్నించారు. గాంధీ సత్యాగ్రహం విరమించలేదు. రాజీకి అంగీకరించలేదు. 1917 జూన్‌ 5న రాంచీలో బిహార్‌–ఒడిశా గవర్నర్‌ ఎ గెయిట్‌తో గాంధీ చర్చలు జరిపాడు.



అక్టోబర్‌ 3న తీన్‌కఠియా నిబంధనను రద్దు చేశారు. అబuŠ‡వాత్‌ పేరుతో వసూలు చేస్తున్న వడ్డీలు చట్ట విరుద్ధమని నిర్ధారించారు. టేకేదార్ల వ్యవస్థను నిర్మూలించారు. పంటపైన హక్కులు జమీందార్లకు కాకుండా రైతులకే ఉంటాయని అన్నారు. ఈ విజయాలన్నీ దేశంలో నిర్వహించిన తొలి అహింసాత్మక ఉద్యమం ఫలితాలు. రెండు అంశాలు గమనించాలి. ఒకటి, చంపారన్‌పైన గాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకనలు చేయలేదు. పత్రికలకు ఎక్కలేదు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టలేదు. ఒకటే సమస్యపైన దృష్టి పెట్టారు. అది పరిష్కారమయ్యే వరకూ అక్కడే దాన్ని పట్టుకునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ స్పందిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు చంపారన్‌ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.



ఏదో ఒక సమస్యపైన దృష్టి కేంద్రీకరించి అది పరిష్కారమయ్యేవరకూ కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయి. చంపారన్‌ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తి. ఆ తర్వాతనే సర్దార్‌ పటేల్‌ బర్దోలీ రైతాంగ పోరాటం చేశారు. అనంతరం మాప్లా ముస్లిం రైతుల తిరుగుబాటు, మద్రాసు ప్రెసిడెన్సీ రైతు ఉద్యమం, చీరాల–పేరాల ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్‌ ఉద్యమం, ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకూ కొమ్మారెడ్డి సూర్యనారాయణ, తలసాని వాసుదేవరావుల ఆధ్వర్యంలో ఆంధ్ర రైతాంగ యాత్ర జరిగాయి. చివరికి స్వాతంత్య్ర సమరంలో రైతుల భాగస్వాములు కావడానికి కూడా చంపారన్‌ తిరుగుబాటే కారణం. కాంగ్రెస్‌వారు కానీ మరో పార్టీ వారు కానీ చంపారన్‌ బాటలో నేటి రైతుల సమస్యను అధ్యయనం చేస్తే పరిష్కారం లభించవచ్చు.






కె. రామచంద్రమూర్తి

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top