నాటా వేడుకల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

YSR Birth Anniversary celebrations in America - Sakshi

ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా ఉత్సవాల్లో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. ఫిలడెల్ఫియాలోని నాటా కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్‌ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తారని  వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఎన్నో కష్టాలు పడుతున్నారని, అలాగే లక్షలాది మందిని కలుస్తున్నారని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. ఏపీలో ఏ ఊరికి వెళ్లినా చొక్కా గుండీలు విప్పి ఆపరేషన్ అయిన గుండెలు చూపిస్తూ వైఎస్సార్‌ని గుర్తు చేసుకుంటారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మందికి వైద్యానికి అయ్యే మొత్తం సాయం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. వైఎస్సార్‌ అంటేనే ఒక నమ్మకమని, ఆయనున్నారనే భరోసా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉండేదని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ప్రజల మనిషని, ప్రజలకోసమే పుట్టి ప్రజల కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2020 నాటా కన్వెన్షన్‌కు వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి హోదాలో రావాలని కోరుకుంటున్నామని నాటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాఘవ రెడ్డి అన్నారు. జగన్ సీఎం అయ్యే వరకు ప్రతి వైఎస్సార్ అభిమాని కృషి చేయాలన్నారు.

పోలవరం కోసం వైఎస్‌ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఓ మహిళ 3 గంటల పాటు ముగ్గురు ఆడపిల్లలతో వేచి చూసిందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఎందుకమ్మా అంతసేపటి నుంచి వేచి చూస్తున్నావని అడిగితే, ' నా భర్త మృతి చెందాడు. ముగ్గురు పిల్లలు చెవిటి వాళ్లుగా ఉండేవారు. అయితే ముగ్గురికి వైఎస్సార్ ఆపరేషన్ చేయించారు. రూ.18 లక్షలతో కంకిలియర్ ప్లాంటేషన్ చేయించారు' అని ఆ మహిళ తనతో చెప్పారని అనికుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. నాటా వేడుకల్లో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసాని అన్నారు. వీటి కోసం కన్వెన్షన్ తేదీలను మార్చుకున్నామని తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

2019 లో వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అని నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌సాగర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర  చేస్తున్నారన్నారు. ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. వాళ్ల అందరికి విమానం టిక్కెట్ తాను ఇప్పిస్తానన్నారు. జగన్ కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కు భారత రత్న ఇవ్వాలని, దాని కోసం కోటి సంతకాల సేకరణ చేపడతామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో వైఎస్సార్‌ను అనుకరిస్తూ రమేష్ చేసిన మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది.




ప్రముఖ దాత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) జీవితకాల పురస్కారం అందుకున్న సందర్భంగా నెల్లూరు ఎన్నారై బత్తినపట్ల సురేందర్‌ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. 
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top