
వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు. చిత్రంలో వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తదితరులు
ఇడుపులపాయలో వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
మౌనం పాటించి వైఎస్సార్‌ను స్మరించుకున్న కుటుంబ సభ్యులు
భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానులు, ప్రజలు
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతీరెడ్డి, సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, సమీప బంధువులు మహానేత విగ్రహానికి పూల మాలలు వేసి స్మరించుకొని నివాళులు అర్పించారు. పులివెందుల నుంచి వారు రోడ్డు మార్గాన ఉదయం 7.45 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. పాస్టర్లు బెనహర్ నరేష్ , మృత్యుంజయ, రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రెండు నిమిషాల పాటు మౌనం వహించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునా«థరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డాక్టర్ సుధ, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్‌బాష, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సమీప బంధువులు వైఎస్ యువరాజ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ సుగుణమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డితో పాటు అనంతపురం జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ కదిరి ఇన్‌చార్జ్ మక్బూల్‌బాషా తదితరులు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.
‘వైఎస్సార్ అమర్ రహే.. మరుపురాని నేత వైఎస్సార్..’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇడుపులపాయకు తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులను వైఎస్ జగన్ పేరుపేరునా పలకరించారు. అనంతరం వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు.