
డాలస్ : టెక్సాస్‌లోని డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులు ఇర్వింగ్‌లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర దేశం కోసం వీరమరణం పొందిన జవాన్లకి ఆశ్రు నివాళి అర్పించారు. భారత దేశంలోని జమ్మూ కశ్మీర్‌లో పుల్వామాలో జవాన్ల పై జరిగిన తీవ్రవాద దాడిని దేశం మీద జరిగిన దాడిగా తెలుగు ఎన్‌ఆర్‌ఐలు వర్ణించారు. తీవ్ర వాదం వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యంగా భారత దేశం గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందన్నారు. ప్రపంచ దేశాలు అన్ని కలిసి తీవ్రవాదం మీద పోరాడి తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించివేయాలని ప్రపంచదేశాలకి విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ దేశం పెంచిపోషిస్తోందని, అనేక తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని తెలుగు ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ సైతం ఈ తీవ్రవాదంతో అనేక ఇబ్బందులు పడటమే కాకుండా తన దేశంలో ఉన్న అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటోదని, మిగిలిన దేశాల్లో సైతం తీవ్రవాద భావజాల వ్యాప్తికి ఆ దేశం సహకరించడమే కాకుండా తీవ్రవాదులకి అన్ని రకాలుగా సహాయపడుతూ దాడులకి వారిని ప్రోత్సహించడం దారుణమని ప్రపంచ దేశాలన్నీ కలిసి అలాంటి దేశాల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి కష్ట సమయంలో భారత దేశంలో ఉన్న ప్రజలంతా తమ దేశపు సైన్యానికి, వీరమరణం పొందిన కుటుంబ సభ్యులకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సంయుక్త కార్యదర్శి ప్రబంద్ రెడ్డి తోపుదుర్తి, పూర్వాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యనిర్వాహక సభ్యులు సతీష్ బండారు, కల్యాణి తాడిమేటి, మనోహర్ కసగాని, ప్రభాకర్ రెడ్డి మెట్ట, సుమేద్ తాడిమేటి, పివి రావు, డాక్టర్ ఇస్మాయిల్, నారాయణ స్వామి వెంకట యోగి, దయాకర్ మాడ, గాలి శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిషోర్ నీలకంటం, ఉదయ్ నిడగంటి, శ్రవణ్ నిడగంటి, చంద్ర, శ్రీనివాస్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.