
విశాఖపట్నం : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కర్రి అరవింద్ (22) కుటుంబానికి సింగపూర్ తెలుగు సమాజం అండగా నిలిచింది. సింగపూర్‌లోని మెగాయార్డులో కర్రి అరవింద్ పని చేస్తున్నారు. సెలవులకి స్వస్థలం విశాఖపట్నం వచ్చినప్పుడు, స్నేహితుడితో కలిసి బైక్ మీద వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అరవింద్ స్నేహితుడు మృతిచెందగా, అరవింద్ తీవ్ర గాయాలకు గురై కోమాలోకి వెళ్లారు. వారిది పేద కుటుంబం కావడంతో సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు తలోక చేయి వేసి, తోటి కార్మిక మిత్రునికి చేయూతగా నిలిచారు. రూ. 2,50,000 ను వైద్య ఖర్చుల నిమిత్తం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అరవింద్ తల్లికి అందజేశారు.
సాటి తెలుగు వ్యక్తి ప్రమాదవశాత్తు ఆపదలో ఉన్నాడని తెలియగానే, సింగపూర్ తెలుగు సమాజం వారి పిలుపికి స్పందించి సకాలంలో సహాయాన్ని అందించిన వారందరికీ పేరు పేరునా సింగపూర్ తెలుగు సమాజం తరపున అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారికి, ముఖ్యంగా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా సింగపూర్ తెలుగు సమాజం ముందుంటుందన్నారు.