న్యూజెర్సీలో సాయిబాబా ఆలయానికి భూమి పూజ

Sai Datta Peetham starts Sai baba temple in New Jersey - Sakshi

న్యూ జెర్సీ : సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో అమెరికాలో షిరిడీ తరహాలో సాయి బాబా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో సాయి భక్తుల కోసం న్యూజెర్సీలో నిర్మిస్తున్న సాయిబాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి, బాబా వారి 100 సంవత్సరాల పుణ్య తిధి సందర్భంగా సాయిదత్తపీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, వేద పండితులు బైరవ మూర్తిల ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. వేద మంత్రాల మధ్య భూమి పూజను వేదపండితులు పూర్తి చేశారు. అమెరికాలో షిర్డీ దేవాలయ నిర్మాణం ఎంతో కళాత్మకంగా జరగనుందని సాయిదత్తపీఠం నిర్వాహకులు తెలిపారు. హిందు సాంప్రదాయక జీవన ఆదర్శాలు ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా అమెరికాలో షిరిడీ నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఈ ఆలయం అచ్చం షిరిడీని పోలి ఉండేలా ప్రణాళికలు సిద్దం చేశారు.

స్థల దాతలు, నిర్మాణ దాతల వివరాలను ఆలయ గోడల మీద లిఖించనున్నట్టు సాయిదత్తపీఠం తెలిపింది. దాతలతో పాటు ప్రత్యేక విరాళాలిచ్చే దాతల కుటుంబసభ్యుల పేర్లను  ఈ గోడలపై చెక్కిస్తారు. గురుస్థానం, లెండివనము, ద్వారకామాయి, నిత్య ధుని, చావడి సదుపాయాన్ని ఈ ఆలయంలో కూడా నిర్మించనున్నారు. బాబా వారి శతసంవత్సర సమాధి సమయ సందర్భంగా, ఫ్రాంక్లిన్ టౌన్ షిప్ వారి పర్మిషన్స్ నడుమ, విజయదశమి నాడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, సాయి దత్త పీఠం బోర్డు డైరెక్టర్స్ హాజరయ్యారు.
 

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top