
వైద్య రంగంలో మరో సంచలనం. ఓ మహిళ గర్భంలో ఉన్న 24 వారాల వయసు బిడ్డకు ఉన్న వెన్నెముక లోపాన్ని అమెరికా వైద్యులు సరిచేశారు. ఏకంగా ఆమె గర్భసంచిని బిడ్డతో సహా బయటికి తీసి శస్త్రచికిత్స చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లెక్సీ రోయర్‌కు 28 ఏళ్లు. ఈ ఏడాది మేలో లెక్సీ నెలవారీ గర్భపరీక్షలు చేయించుకునేందుకు వెళ్లింది. అప్పుడే తెలిసింది.. పుట్టబోయే బిడ్డ వెన్నెముకలోని కొంత భాగం శరీరం నుంచి బయటకు వచ్చిందని. ‘స్పైనా బైఫిడా’ అని పిలిచే ఈ రకమైన పరిస్థితి అమెరికాలో ప్రతి 4,200 మంది పిల్లల్లో ఒకరికి ఉంటుందని రికార్డు లు చెబుతున్నాయి. బిడ్డ పుట్టాక శస్త్రచికిత్స చేసి పరిస్థితిని సరిచేయడం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతి. అయితే ఈ శస్త్రచికిత్స విజయవంతం కావ డం చాలా అరుదు. ఈ నేపథ్యంలో బిడ్డ గర్భసంచిలో ఉండగానే శస్త్రచికిత్స చేసి వెన్నెముకను సరిచేయాలని హోస్టన్‌లోని టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు నిర్ణయించారు. లెక్సీ రోయర్, ఆమె భర్త ఇందుకు అంగీకరించడంతో గత నెల 27న శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.
సిజేరియన్ తరహాలో..
సిజేరియన్ ఆపరేషన్ మాదిరిగానే మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ గర్భసంచిని లెక్సీ శరీరం నుంచి కొంచెం బయటకు తీశారు. గర్భసంచి ఉపరితలంపై 4 మి.మీ మేర కోత పెట్టారు. ఉమ్మనీరు తీసేసి.. అందులోకి కార్బన్‌డయాక్సైడ్ వాయువును పంపి, గర్భసంచి ఉబ్బేలా చేశారు. కెమెరా తో పాటు బల్బు ఉన్న ఓ యంత్రాన్ని లోపలికి పంపించారు. బిడ్డకు వెన్నెముక బయటకొచ్చిన ప్రాంతంలో చర్మంపై చిన్న గాట్లు పెట్టి.. వెన్నెముకను శరీరం లోపలికి యథాస్థానంలోకి పంపారు. ఆ తర్వాత బిడ్డ శరీరానికి కుట్లు వేసి గర్భసంచి మొత్తాన్ని సెలైన్, యాంటీబయోటిక్ ద్రావణాలతో నింపా రు. గర్భసంచిని యథాస్థితిలో ఉంచి కుట్లు వేశారు. 4 గంటల పాటు 12 మంది డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. బిడ్డ పుట్టాక కానీ ఈ శస్త్రచికిత్స విజయవంతమైందీ లేనిదీ చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు.
మూడేళ్ల శ్రమ..
ఈ ఆపరేషన్ చేసేందుకు టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు మైకేల్ బెల్‌ఫోర్ట్, విలియం వైట్‌హెడ్‌లు మూడేళ్లు శ్రమించారు. బార్సిలోనాకు చెందిన మరికొందరు డాక్టర్ల సాయంతో వీరు మూడేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్