రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించండి: వైఎస్ జగన్


కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరిన వైఎస్ జగన్ బృందం  సాక్షి, న్యూఢిల్లీ: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం అయినా వాటిని సరిదిద్ది, ఆంధ్ర ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించే రాజధానికి కేంద్ర సహకారం అవసరమన్నారు. ‘‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా రాష్ట్రం తనకుతానుగా అన్ని అవసరాలను తీర్చుకోలేదు.

 

కొత్త రాజధానిని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సి ఉన్నందున దానికి అవసరమైన నిధులను కేటాయించండి’’ అని మోడీని కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనపై ప్రకటన చేసే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ సీమాంధ్ర కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై హామీ ఇచ్చారని, ఈ హామీలన్నీ తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారి(ఓఎస్‌డీ)ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని మోడీకి జగన్ విన్నవించారు.

 

ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం నరేంద్ర మోడీని గుజరాత్ భవన్‌లో కలిసింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీత, వరప్రసాద్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి ఉన్నారు. మొదటగా ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

 మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో పార్టీ ఎంపీలను ఒక్కొక్కరిగా మోడీకి పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరుతూ నాలుగు పేజీల విజ్ఞాపన పత్రం అందజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంపూర్ణ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గత ప్రభుత్వం అసంబద్ధ ప్రకటనలు చేసిందని, దీనిపై మొదటి బడ్జెట్ సెషన్‌లోనే నూతన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని దృష్టికి తెచ్చారు.

 

 రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలి..

 ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుత రైతు దైన్య స్థితిని జగన్ మోడీ దృష్టికి తెచ్చారు. వరుసగా వచ్చిన  తుపాన్లు, అకాల వర్షాల కారణంగా రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంటలు, ఉద్యానవనం, కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నాయని వివరించారు. అయినప్పటికీ గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, వారికి ఆసరాగా నిలవలేదని తెలిపారు. ఇదే సమయంలో పెరిగిన ఎరువుల ధరలు, వ్యవసాయ ఖర్చుల కారణంగా రైతులు డీలా పడిపోయారని, వారిని ఆదుకోవాలని ఎన్నిమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వివరించారు. ఈ దృష్ట్యా ప్రస్తుత ప్రభుత్వం అయినా వారికి అండగా నిలిచి, వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.

 

 రాజ్‌నాథ్‌తోనూ భేటీ..

 మోడీతో భేటీ అనంతరం సాయంత్రం వైఎస్ జగన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీజేపీకి అద్భుత విజయాన్ని సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎంపీలందరినీ రాజ్‌నాథ్‌కు పరిచయం చేసిన జగన్, కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ సహకారం కోరారు. ఈ భేటీ అనంతరం జగన్ మాట్లాడుతూ ‘‘ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ఇతర అంశాలపై చర్చించలేదు’’ అని తెలిపారు.

 

 మోడీ సానుకూలంగా స్పందించారు: జగన్

 మోడీతో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో రాష్ట్ర పురోభివృద్ధికి సంపూర్ణ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఇదే సమయంలో ‘రాష్ట్రాన్ని ఎంత దారుణంగా విభజించారంటే ప్రధాని పదవి నుంచి వైదొలగనున్న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో కేవలం ఓ లేఖ మాత్రమే చదివి వినిపించారు. ఆ లేఖలోని అంశాలు కనీసం బిల్లులోకి కూడా రాలేదు. అంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించారు. హైదరాబాద్‌ను తీసేసిన తర్వాత కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారన్నది కూడా పేర్కొనలేదు.

 

 ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పినప్పటికీ ప్రత్యేక హోదా ఏమిటీ?, వేటికి ఇది వర్తిస్తుంది చెప్పకుండా దారుణంగా విభజన చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో త్వరలోనే ప్రధానిగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో.. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించడం వల్ల జరిగిన అన్యాయాలను సరిచేస్తూ ఈ బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే కొన్ని కొన్ని మార్పులు కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించాం. మీ సహాయం కావాలని కోరాం. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. కొత్త రాష్ట్రానికి ఏది మంచో అది చేస్తామని చెప్పారు’’ అని తెలిపారు.

 

 ఎన్డీఏకు అంశాలవారీ మద్దతు..

 ఇదే సమయంలోఎన్డీఏకు మద్దతుపై జాతీయ చానళ్ల ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘ఈ రోజు మోడీకి మా మద్దతు అవసరం లేదు. వారికి సొంతంగానే 283 పార్లమెంట్ స్థానాలున్నాయి. వారికి ఎవరి సహాయం అవసరం లేదు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఈ దేశ ప్రధాని సహాయం కావాలి. ఆయన సంపూర్ణ సహకారాలు మాకు కావాలి. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నామని మేము ఏనాడూ చెప్పలేదు. వారికి అంశాల వారీగా మద్దతు కచ్చితంగా ఇస్తాం. రాష్ట్ర ప్రయోజనాలు మాకు చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలపై మోడీ సైతం సానుకూలంగా ఉంటారనే భావిస్తున్నాం’’ అని చెప్పారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలోనూ విలేకరులతో మాట్లాడిన వైఎస్ జగన్, ఎన్డీఏకు మద్దతు విషయంపై పై విధంగానే స్పందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top