మీటూ సంచలనం : సీనియర్‌ను కోర్టుకీడ్చిన యాంకర్‌

Years Before MeToo, Television Anchor Dragged Her Alleged Abuser To Court - Sakshi

మీటూ రావడాని కంటే ముందే, ఐదేళ్లుగా కోర్టులో పోరాటం

సీనియర్‌ కీచకాలను బయటపెట్టిన యాంకర్‌

చెన్నై : మీడియాలోనూ కీచకులు ఉన్నారని బయటపెడుతూ.. సోషల్‌ మీడియా వేదికగా మీటూ ఉద్యమం రగులుతోంది. న్యూస్‌రూమ్‌ల్లో, ఇంటర్వ్యూల్లో తాము ఎదుర్కొన్న భయానకమైన అనుభవాలను మహిళా జర్నలిస్ట్‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. బయటికి ఎంతో ప్రముఖంగా, హుందాగా వ్యవహరించే వారు సైతం, ఓ అమ్మాయితో ఇలా ప్రవర్తించారా? అనే రీతిలో మీటూ ఉద్యమం రగులుతోంది. అయితే ఈ మీటూ ఉద్యమం రాకమునుపే అంటే ఓ ఐదేళ్ల ముందే చెన్నైలో ఓ మహిళా జర్నలిస్ట్‌, ప్రముఖ మీడియా హౌజ్‌లో పనిచేసే తన సీనియర్‌ను కోర్టుకు ఈడ్చింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో, కోర్టులో కేసు దాఖలు చేసింది. ఆర్గనైజేషన్‌ నుంచి, తన కొలీగ్స్‌ నుంచి ఇసుమంతైనా సపోర్టు లేనప్పటికీ, ఒకతే ఎన్నోఏళ్లుగా ఆ కీచకుడిపై కోర్టులో యుద్ధం చేస్తోంది. 

అకిలా తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రముఖ మీడియా హౌజ్‌ సన్‌ టీవీలో న్యూస్‌ యాంకర్‌గా చేరింది. అయితే ఆ ఛానల్‌లో మాజీ చీఫ్‌ ఎడిటర్‌ అయిన వీ రాజ ఆమెను లైంగికంగా సహకరించాలంటూ వేధింపులకు దిగాడు. కానీ ఆమె దానికి ససేమీరా అనడంతో, అకిలతో మరింత క్రూరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. న్యూస్‌రూమ్‌లో వేధించడం, బదిలీ చేస్తానంటూ హెచ్చరించడం, పదే పదే ఉదయం సిఫ్ట్‌లు వేయడం చేశాడు. ఆ కీచకుడి వేధింపులు వేగలేక అకిలా, ఓ రోజు అతనిపై లైంగిక వేధింపుల కేసు ఫైల్‌ చేసింది. దీంతో అకిల ఆరోపణలపై సంస్థలోని హెచ్‌ఆర్‌ విభాగం కూడా దిగొచ్చి, రాజపై విచారణ ప్రారంభించింది. 

అయితే అకిలకు ఎవరూ సపోర్టు రాకుండా.. రాజ పకడ్బందీ ప్లాన్‌ వేశాడు. ఆమె స్నేహితులందరిని ప్రలోభాలకు గురిచేశాడు. దీంతో అకిల ఎవరైతే తన స్నేహితులని భావించిందో, వారందరూ కూడా రాజవైపు వెళ్లిపోయి, ఆమెకు వ్యతిరేకమయ్యారు. రాజపై లైంగిక వేధింపుల కేసు, పరువు నష్టం కేసుతో పాటు, వారిపై కూడా 2014లో పరువు నష్టం కేసు దాఖలు చేసింది అకిల. 

ప్రస్తుతం ఈ కేసుల విషయంలో అకిలా కోర్టులో పోరాటం చేస్తోంది. ఆ సంస్థలో ఉద్యోగం మానేసినప్పటికీ కూడా, కోర్టులో పోరాటం మాత్రం ఆపలేదు. అయితే రాజ తన తరుఫున ఒక న్యాయవాదిని నియమించుకోగా.. సన్ నెట్‌వర్క్‌ కూడా అతని కోసం మరో న్యాయవాదిని నియమించింది. ఎంత మంది న్యాయవాదులు, ఎంత పెద్ద సంస్థ రాజకు మద్దతుగా నిలిచినా.. అకిల ఏ మాత్రం జంకకుండా.. తనను లైంగికంగా వేధించిన అతనిపై సాహోసపేత పోరాటం చేస్తోంది. 

ప్రెగ్నెన్సీతో కూడా కోర్టుకు వచ్చా...
‘గత ఐదేళ్లుగా ఈ కేసుల విషయంలో పోరాడుతూనే ఉన్నా. న్యాయం బయటికి రాకుండా ఉండేందుకు నిందితుడు కోర్టు ప్రక్రియను జాప్యం చేస్తూ ఉన్నాడు. ఎన్ని సార్లు సైదాపేట్‌ కోర్టు మెట్లు ఎక్కి, దిగానో లెక్కలేదు. గర్భంతో ఉన్నా రాజపై పోరాటం మాత్రం ఆపలేదు. ఆ తర్వాత నా చిన్నారిని ఎత్తుకుని కూడా కోర్టు ట్రయల్‌కు వచ్చా’ అని అకిలా చెప్పింది. ప్రస్తుతం ఈ కేసులు తుది దశకు వచ్చాయి. మరో మూడు నెలల్లో న్యాయం గెలవబోతుందని అకిల చెప్పింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల కంటే, తన స్నేహితులు నిందితుడికి మద్దతుగా మారడమే ఎక్కువగా బాధించిందని అకిల అన్నారు. తన కేసులో ఓ మాజీ యాంకర్‌ తనకు సాక్ష్యంగా నిలిచిందని, తనతో కూడా రాజ అలానే చెడుగా ప్రవర్తించాడని చెప్పిందని తెలిపారు. కోర్టులో తను పోరాడుతున్న సమయంలో, మరికొంత మంది యాంకర్లు కూడా అకిలకు మద్దతుగా నిలిచారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో, తమను రాజ లైంగికంగా సహకరించాలంటూ డిమాండ్‌ చేశాడని చెప్పారు. వీరు కూడా ప్రస్తుతం వారి ఫిర్యాదులను కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. 

వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి ఏ మాత్రం భయపడవద్దని, చాలా ధైర్యంగా పోరాడాలని అకిల సూచించింది. ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే, అందరి ముందు గట్టిగా నాలుగు చెంప దెబ్బలు కొట్టండని సలహా ఇచ్చింది. మీరు నిశ్శబ్దంగా ఉంటే, వారు మరింత రెచ్చిపోతారని తెలిపింది. మీటూ ఉద్యమం రగులుతున్న ఈ క్రమంలో, ఎవరైనా మహిళ లైంగిక వేధింపులు గురయ్యాయని చెబితే, వాటిని కొట్టి పడేయకుండా.. ఆమె వేదనను అర్థం చేసుకోవాలని కూడా సూచించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top