అద్భుతమైన గానం.. నెటిజన్ల ఆనంద పారవశ్యం!

Woman Rendition of Lata Mangeshkar Song Amazes Internet - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ప్రతిభకు కొదవ లేదు. దేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఎంతో ప్రతిభ గల వ్యక్తులు తారసపడతారు. సాదాసీదా జీవితం గడుపుతూనే తమ అద్భుతమైన టాలెంట్‌తో అబ్బురపరుస్తుంటారు. తాజాగా అలాంటి ప్రతిభావంతురాలైన మహిళ వెలుగులోకి వచ్చారు. ఓ రైల్వే స్టేషన్‌లో పనిచేసుకుంటూ.. పొట్టపోసుకుంటున్న ఆమె తన గానంతో ఎందరో హృదయాలను హత్తుకుంటున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పాడిన అలనాటి క్లాసిక్‌ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాలను పరశింపజేస్తున్నారు. ‘బర్పెటా టౌన్‌ ద ప్లేస్‌ ఆఫ్‌ పీస్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ఆమె గానాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆమె.. ‘ఏక్‌ ప్యార్‌కి నగ్మా’ అనే పాటను ఆలాపిస్తున్న వీడియోను ఆ పేజీ పోస్టు చేసింది. రెండు నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె గానాన్ని, ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయులు అవుతున్నారు. గాంధర్వ గానమంటే ఇదే అయి ఉంటుందని, అచ్చం లత మంగేష్కర్‌ సుతిమెత్తగా పాట పాడుతుందా? అన్నంత మాధుర్యం ఆమె గొంతులో ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె గానంలో ఓలలాడుతూ ఆనందపారవశ్యులవుతున్నట్టు పేర్కొంటున్నారు. జూలై 28న పోస్ట్‌ చేసిన ఆమె సింగింగ్‌ వీడియోను ఇప్పటికే 16లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 35వేల మంది ఆమె వీడియోను షేర్‌ చేసుకున్నారు. ఆమె పాట సూపర్‌ హిట్‌ కావడంతో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో లతా మంగేష్కర్‌ క్లాసికల్‌ పాటను ఆమె మధురంగా ఆలపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top