
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికి చికిత్స అందించేందుకు వెళుతుండగా విమానం ఆలస్యం కావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార, సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి అల్ఫోన్స్ కన్నాథనమ్‌పై ఓ మహిళా డాక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కారణంగా విమానం జాప్యం కావడంతో మహిళా వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ కల్చర్‌ను తీవ్రంగా తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.
విమానం మరింత ఆలస్యం కాదని స్పష్టం చేస్తూ తనకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మంత్రిని పట్టుబట్టారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌లో వీవీఐపీల కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయంటూ మహిళా డాక్టర్ మంత్రితో తీవ్ర వాగ్వాదానికి దిగారు.