మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి ఖాతా తెరిచిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌పై కన్నేసింది. ‘మేం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తాం.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచి ఖాతా తెరిచిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌పై కన్నేసింది. ‘మేం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తాం. అధికార సమాజ్‌వాదీ, బీఎస్పీలు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తుచేస్తున్నాం’ అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. 2017లో యూపీలో ఎన్నికలు జరగనున్నందున పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటవుతుందని అన్నారు.
యూపీ ప్రభుత్వం తన సభలకు అనుమతులు ఇవ్వకుండా శాంతిభద్రతల పేరుతో మోకాలడ్డుతోందని ఆరోపించారు. కర్ణాటకలో తమది రిజిష్టర్డ్ పార్టీ అయినప్పటికీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో తన సభకు అనుమతి ఇవ్వలేదని వాపోయారు. సొంతరాష్ట్రమైన తెలంగాణలో కూడా తనపై క్రిమినల్ కేసులున్నాయన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తే బీజేపీకి లాభమని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 8 ఏళ్లు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి 2012లో బయటికొచ్చినా తనకు సోనియాగాంధీ అన్నా, మన్మోహన్ సింగ్ అన్నా ఇప్పటికీ ఎనలేని గౌరవం ఉందని చెప్పారు.