‘అర్బన్‌ మావోయిస్టులు’ అంటే ఎవరు?

Who Is Urban Maoists - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం ఉదయం పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి వారిలో వరవరరావు సహా ఐదుగురిని అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఈ ఐదుగురు సామాజిక కార్యకర్తలతోపాటు భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో జూన్‌లో అరెస్ట్‌ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలను కూడా పోలీసులు అర్బన్‌ మావోయిస్టులు లేదా అర్బన్‌ నక్సలైట్లుగా వ్యవహరించారు. ఇంతకు ఈ అర్బన్‌ మావోయిస్టులంటే ఎవరు? వారిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఆ పదం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది?

బాలివుడ్‌ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత వివేక్‌ అగ్నిహోత్రి ‘అర్బన్‌ నక్సల్‌’ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ‘అర్బన్‌ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ ‘హాఫ్‌ మావోయిస్ట్స్‌’గా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్‌ కూడా చేశారు. బహుశ ఆయన కూడా వివేక్‌ వ్యాసాన్ని చదివి ఉండవచ్చు!

భీమా కోరెగావ్‌ అల్లర్ల కేసులో జూన్‌ ఆరవ తేదీన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్‌ షోమా సేన్, సామాజిక కార్యకర్తలు మహేశ్‌ రౌత్, సుధీర్‌ ధావ్లే, రోనావిల్సన్‌లను అరెస్ట్‌ చేసినప్పుడు వారిని పోలీసులు ‘అర్బన్‌ మావోయిస్టులు’గా పేర్కొన్నారు. బాలీవుడ్‌ అగ్నిహోత్రి రాసిన వ్యాసాన్ని పోలీసులు చదివి ఉన్నారా? పట్టణాల్లో నివసిస్తున్న మావోయిస్టులుగా భావించి కాకతాళీయంగానే అలా పిలిచారోమో వారికే తెలియాలి. అప్పటి నుంచి మాత్రం ‘అర్బన్‌ మావోయిస్టులు’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top