
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..
వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్‌లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్‌లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేసింది.
భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..
2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.