కత్తి మహేశ్‌ను హీరో చేసిందెవరు?

Who Made Kathi Mahesh As A Hero - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు. పైగా రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినిమా విశ్లేషకుడు కత్తి మహేశ్, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా పాద యాత్ర జరుపుతానంటూ హెచ్చరిక చేసిన పరపూర్ణానంద స్వామి పట్ల పరస్పరం భిన్నంగా వ్యవహరించడం కూడా తెలంగాణ పోలీసులకే చెల్లింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా కత్తి మహేశ్‌కు ఎలాంటి న్యాయపరమైన నోటీసులు ఇవ్వని పోలీసులు (పిలిపించి మాట్లాడారే తప్ప), మత మార్పిడిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిపూర్ణానంద స్వామికి మాత్రం నోటీసులు జారీ చేశారు.

అంతేకాకుండా తొలుత స్వామిని గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు, కత్తి మహేశ్‌ను మాత్రం నగర బహిష్కారం చేశారు. పోలీసుల నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడమే కాకుండా ప్రతిపాదిత నిరసన పాద యాత్రను మానుకోనని మొండికేయడంతోనే స్వామినీ కూడా నగర బహిష్కారం చేశారు. సమన్యాయం చాటుకునేందుకే అలాచేసి ఉండవచ్చు. కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు నిక్కచ్చిగా ఆయన తన సొంత అభిప్రాయంగానే చెప్పారు. అది ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆయన అభిప్రాయంతో ఎవరైనా విభేదించవచ్చు. విమర్శించవచ్చు. అంతేగానీ శిక్షించే అధికారం చట్టానికే లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులకు ఇంకెక్కడిది? ఆ మాటకొస్తే రామాయణంపై అందులోని పాత్రలపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఎంతో మంది సాహిత్యవేత్తలు, మేథావులు రామాయణాన్ని విమర్శించారు. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రముఖ తెలుగు మహిళా సాహితీవేత్త రంగనాయకమ్మ ‘రామాయణం ఓ విష వృక్షం’ అని ఓ గ్రంధమే రాశారు.

దక్షిణాదిలో ద్రావిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్‌ ఈవీ రామస్వామి రామాయణంలోని అన్ని పాత్రలను విశ్లేషిస్తూ దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, కౌసల్యా.. తదితర పాత్రలన్నింటిని విమర్శించారు. రాముడు, లక్ష్మణుడు శూర్పనకను అవమానించిన కారణంగానే అందుకు ప్రతీకారంగానే రావణాసురుడు సీతనుఎత్తుకు పోయాడని, అమెను కనీసం ముట్టుకోలేదంటూ రావణాసురుడిని సమర్థించారు. రామాయణాన్ని ఆయన విశ్లేషిస్తూ పెరియార్‌ రామస్వామి రాసిన ‘ఈవీ రామస్వామీస్‌ రీడింగ్‌ ఆఫ్‌ ది రామాయణ’ అనే పుస్తకాన్ని తమిళయన్లు పవిత్ర గ్రంధంగా పూజిస్తున్నారు. పెరియార్‌ రామస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన ప్రారంభించిన ద్రావిడ ఉద్యమం పేరు దాదాపు అన్ని రాజకీయ పార్టీల పేర్లలో మిలితమై ఉంటుంది. ఇటు పెరియార్‌ రామస్వామి పుస్తకాన్నిగానీ, తెలుగునాట రంగనాయకమ్మ రాసిన ‘రామాయణం విషవృక్షం’ పుస్తకాన్ని ఎందుకు నిషేధించలేదు? ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా పేపర్‌బ్యాక్స్‌ ప్రచురించిన ‘మెనీ రామయాణాస్‌’ చదివితే ఇంకేమైనా ఉందా? ఇంకా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను నిషేధించలేదు కనుక, ఈ పుస్తకాలను కూడా నిషేధించలేదు.

ఈ నేపథ్యంలోనే కత్తి మహేశ్‌కు నగర బహిష్కార శిక్ష సబబా, కాదా? అన్న చర్చ వస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కత్తి మహేశ్‌కు వచ్చిన పబ్లిసిటీ ఏమోగానీ నగర బహిష్కరణ శిక్ష ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ చాలా ఎక్కువ. మహేశ్‌ వర్సెస్‌ పరిపూర్ణానంద స్వామి ఎపిసోడ్‌లో స్వామి బహిష్కరణను తీవ్రంగా ఖండించిన స్థానిక బీజేపీ నాయకులు మాట వరుసకు కూడా కత్తి బహిష్కారాన్ని  ఖండించలేదు.

కేంద్రంలో ఇటీవల అస్తమానం భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం ఈ ఎపిసోడ్‌పై స్పందించడం లేదు. అదే నెట్‌ఫిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్‌ సిరీస్‌ ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని విమర్శించారంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. గాంధీ, నెహ్రూలు వారికి దేవుళ్లతో సమానం కనుక వారికి కోపం వచ్చి ఉంటుంది. హిందువులను కించపరిచే డైలాగులు ఉన్నాయంటూ సాక్రెడ్‌ గేమ్స్‌పై ఆరెస్సెస్‌ వారు కూడా కోర్టుకెళ్లారు. అది వేరే విషయం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top