వాట్సాప్‌ ‘ఆకాశవాణి’ అవగాహన..

WhatsApp starts campaigns in India to control fake news - Sakshi

దేశంలోని చట్టాలకు లోబడి పనిచేయాలని, ఏదైనా సమస్య ఎదురైతే దానికి అమెరికా నుంచి కాకుండా భారత్‌ నుంచే సమాధానం ఇచ్చేలా ఆ సంస్థ ప్రతినిధి ఇక్కడే ఉండేలా, గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే వాట్సాప్‌ సీఈఓ క్రిస్‌ డానియల్స్‌ను  కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ సంస్థ నకిలీవార్తల నియంత్రణ చర్యలతో పాటు ఆకాశవాణి (ఏఐఆర్‌) పరిధిలోని 46 హిందీ రేడియో స్టేషన్లలో గురువారం నుంచి అవగాహన, ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ముందుగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్‌ల వ్యాప్తంగా ఈ సర్వీసును ప్రారంభించి, రాబోయేరోజుల్లో ఇతర భారతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. ‘మీరు, మేము కలిసి పుకార్లను నిర్మూలిద్దాం’ అంటూ 30 సెకన్ల కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లోభాగంగా తమకొచ్చే మెసేజ్‌లు ఏ మేరకు విశ్వసనీయమైనవో యూజర్లు తెలుసుకునేందుకు చిట్కాలతో పాటు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కారణమవుతాయని భావించే వాటిపైనా ఫిర్యాదు చేసే వీలు కల్పిస్తున్నారు. ప్రమాదకరమైన మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనే హెచ్చరికలు,  వాటిని ఫార్వర్డ్‌ చేస్తే ఎదురయ్యే తీవ్ర సమస్యలను గురించి సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా యూజర్లుండగా,  20 కోట్లకు పైగా  యూజర్లతో భారత్‌ ముందువరసలో నిలుస్తోంది. వాట్సాప్‌ మాధ్యమం ద్వారా నకిలీవార్తల వ్యాప్తి అంశంపై ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించే చర్యలను ఆ సంస్థ ప్రారంభించింది.  భారత్‌లో ఏదైనా మెసేజ్‌ను లేదా వీడియోను ఒకసారి ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్‌ చేసేలా నియంత్రించడంతో పాటు ఒరిజనల్, ఫార్వర్డ్‌ చేసే మెసేజ్‌ల తేడా తెలిసే ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఓ మెసేజ్‌ను ఇరవై మందికి ఫార్వర్డ్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్‌ కల్పించనుంది.  ఏదైనా మెసేజ్‌ను ఒకే అకౌంట్‌ నుంచి ఐదుసార్లకు మించి ఫార్వర్డ్‌ చేస్తే మళ్లీ ఫార్వర్డ్‌ చేసే ఆప్షన్‌ను పనిచేయకుండా చేయనుంది.
 
ఎన్నికల నేపథ్యంలో నకిలీవార్తలపై.. సామాజిక మాధ్యమాల్లో  వదంతులు, నకిలీ వార్తల వ్యాప్తి దేశంలో మూకదాడులు, హింసాత్మక ఘటనలకు దారితీసిన నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసే చర్యలనూ వాట్సాప్‌ ప్రారంభిస్తోంది. ఈ ఏడాది చివర్లో  వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది  జరగనున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నకిలీవార్తల బెడదను అరికట్టడంపై దష్టిని సారించింది. ఢిల్లీకి చెందిన డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ (డీఈఎఫ్‌)తో కలిసి వాట్సాప్‌ యూజర్లలో నకిలీవార్తలపై అవగాహన కల్పించే చర్యలు చేపడుతోంది. ఏదైనా సమాచారాన్ని లేదా వీడియోలను ఇతరులతో షేర్‌ చేసుకోవడానికి ముందే దాని విశ్వసనీయతను సరిచేసుకునే ఆవశ్యకతను తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం పది రాష్ట్రాల్లో (త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా) డీఈఎఫ్‌ 40 శిక్షణా తరగతులు నిర్వహించనుంది.ఏదైనా మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయడానికి ముందు సులువైన పద్ధతుల్లో ఆ సమాచారాన్ని ఎలా సరిచూసుకోవచ్చునో స్థానికనాయకులు, ప్రభుత్వ ఆధికారులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు తెలియజేస్తారు. ఇందులో భాగంగానే  ఏడు రాష్ట్రాల్లో డీఈఎఫ్‌కు సంబంధించిన 30 వేల మంది క్షేత్రస్థాయి కార్యకర్తలకు కూడా శిక్షణనిస్తారు. 

‘గ్రామీణ, ఇతర పేదవర్గాల ప్రజలు కూడా ‘ఆన్‌లైన్‌’ ఉపయోగించుకునేలా చేయాలన్నది మా  సంస్థ ధ్యే యం. వారికి ఆన్‌లైన్‌లో బెదిరింపులు, హెచ్చరికలు, నకిలీవార్తల నుంచి   ఇంటర్నెట్‌ను సురక్షితంగా   ఉపయోగించేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. తమకు వచ్చే ప్రతీ మెసేజ్‌పై వెంటనే ప్రతిస్పందించడానికి బదులు దానిపై ఏ విధంగా స్పందింవాలన్న దానిపై వాట్సాప్‌ యూజర్లలో సహానుభూతి, అవగాహన కలిగించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని వాట్సాప్, డీఈఎఫ్‌ భావిస్తున్నాయి’ అని డీఈఎఫ్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఒసామా మంజర్‌ పేర్కొన్నారు.‘నకిలీవార్తల పట్ల మెరుగైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజలు సురక్షితంగా ఉండేలా చేయాలన్నది మా లక్ష్యం. అంతేకాకుండా ఇలాంటి వార్తల వ్యాప్తి నియంత్రించే అధికారం యూజర్లకు కల్పిస్తున్నాం. డిజిటల్‌ ఇండియా స్వప్నాన్ని సాకారం చేసేందుకు వివిధ రూపాల్లో అవసరమైన మేర మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని వాట్సాప్‌ పబ్లిక్‌ పాలజీ మేనేజర్‌ బెన్‌ సపుల్‌ తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top