వాట్సాప్‌ డేటాపై ‘పెగాసస్‌’ గురి

WhatsApp says Indian journalists, activists were spied on using Israeli spyware - Sakshi

ఇజ్రాయెల్‌ స్పైవేర్‌తో సమాచారం తస్కరణ

బాధితుల్లో భారత జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు  

న్యూఢిల్లీ: వాట్సాప్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ గురువారం వాట్సాప్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 1,400 మందిని లక్ష్యంగా చేసుకుని సమాచార చోరీ జరిగినట్లు గుర్తించింది. ఇందుకు సంబంధించి ఎన్‌ఎస్‌వో కంపెనీపై అమెరికాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంతోపాటు,  భారతీయ యూజర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు తీసుకుంటున్న చర్యలను ఈ నెల 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే నిఘా సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ను గుర్తు తెలియని సంస్థలకు అప్పగించిందని, దీని సాయంతో నాలుగు ఖండాల్లోని సుమారు 1,400 మంది దౌత్యాధికారులు, రాజకీయ అసమ్మతివాదులు, జర్నలిస్టులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని వాట్సాప్‌ తెలిపింది. భారత్‌లో బాధితుల వివరాలు తెలిపేందుకు నిరాకరించింది. దీనిపై కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులో ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సప్‌ కేసు వేసింది.

హక్కుల లాయర్‌ నిహాల్‌ సింగ్‌ రాథోడ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్యకర్త షాలిని గెరా, బీబీసీ మాజీ జర్నలిస్టు సుభ్రాన్షు చౌధరి తదితరులు బాధితులమంటూ ప్రకటించారు. ఉగ్రవాదం నేరాలపై పోరాడేందుకు గుర్తింపు పొందిన ప్రభుత్వ నిఘా సంస్థలకే ఈ సాంకేతికతను అందజేస్తున్నట్లు ఎన్‌ఎస్‌వో సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల వాట్సాప్‌ వినియోగదారుల్లో భారత్‌లో 40 కోట్ల మంది ఉన్నారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా అనుమానిస్తూ మోదీ ప్రభుత్వం చేపట్టిన గూఢచర్యం తేటతెల్లమయిందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యునిగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును కోరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top