
'ఆ పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం'
భూ సేకరణ చట్టం బిల్లును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు.
హైదరాబాద్ : భూ సేకరణ చట్టం బిల్లును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణ చట్టం ప్రజా సంక్షేమం కోసమేనని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వెంకయ్య మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టం అమలు చేయాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ఆయన అన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ ఏప్రిల్ 6లోపు చట్టం కాకపోతే చెల్లుబడి కాదని అన్నారు. దాన్ని ఏవిధంగా చట్టం చేయాలన్నది కేంద్రం చూసుకుంటుందని వెంకయ్య అన్నారు.
అర్థవంతమైన నిర్మాణాత్మక సలహాలు ఉంటే స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని వెంకయ్య నాయుడు అన్నారు. అంతేకానీ...వ్యతిరేకించాలి అంటూ వ్యతిరేకిస్తే పట్టించుకోమని ఆయన స్పష్టం చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతులు, రైతుల పిల్లలకు అన్ని రకాలుగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. మిషన్ కాకతీయ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వెంకయ్య ప్రశంసించారు.