
మమతా బెనర్జీని కిమ్‌తో పోల్చిన కేంద్ర మంత్రి..
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చారు. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మమతా సర్కార్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దేశంలో ప్రజాస్వామ్యానికి తావు లేని రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఒక్కటేనని, మమతా బెనర్జీ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తరహాలో వ్యవహరిస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కిమ్ తరహాలోనే తనకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని ఆమె అణగదొక్కుతున్నారని ఆరోపించారు.
బెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంటనే కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటి మీదుగా సాగేలా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బీజేపీ ఈనెల 6 నుంచి రథయాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ఈ యాత్రకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.