breaking news
girirajsing
-
దీదీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చారు. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మమతా సర్కార్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో ప్రజాస్వామ్యానికి తావు లేని రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఒక్కటేనని, మమతా బెనర్జీ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తరహాలో వ్యవహరిస్తున్నారని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కిమ్ తరహాలోనే తనకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని ఆమె అణగదొక్కుతున్నారని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంటనే కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటి మీదుగా సాగేలా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో బీజేపీ ఈనెల 6 నుంచి రథయాత్రను తలపెట్టిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ ఈ యాత్రకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. -
గిరిరాజ్‌పై ఈసీ కొరడా
‘మోడీ-పాక్’ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఆయన్ను మందలించిన బీజేపీ అధిష్టానం అయినా తన వ్యాఖ్యలను సమర్థించుకున్న గిరిరాజ్ /న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ బీహార్ నేత, నవాడా లోక్‌సభ అభ్యర్థి గిరిరాజ్‌సింగ్‌పై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్, జేడీయూ ఫిర్యాదుతో గిరిరాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జార్ఖండ్ పోలీసులను ఆదివారం ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విదేశాలకు గొడ్డు మాంసాన్ని విక్రయించే వారికి సబ్సిడీ ఇచ్చిన కేంద్రం గోవుల పోషకులపై మాత్రం పన్ను విధించిందన్న ఆయన వ్యాఖ్యలనూ ఈసీ తీవ్రంగా పరిగణించడంతో ఈ ఎఫ్ఐఆర్లో బీహార్ పశు సంరక్షణ చట్టంలోని సెక్షన్లను కూడా పోలీసులు పొందుపరిచారు. మరోవైపు బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టింది. తమ పార్టీ న్యాయం, మానవతా విలువలతో కూడిన రాజకీయాలనే విశ్వసిస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొనగా గిరిరాజ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ వివాదం పెద్దది కాకుండా చూసుకోవాలని గిరిరాజ్‌ను హెచ్చరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: గిరిరాజ్ తన వ్యాఖ్యలపై వివాదం రేగి, పార్టీలో ఒంటరైనప్పటికీ గిరిరాజ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేవారెవరికీ భారత్‌లో చోటులేదని, వారంతా పాకిస్థాన్ వెళ్లాల్సిందేనని ఆదివా రం పాట్నాలో ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవ ర్నైనా వ్యతిరేకించవచ్చు. ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదు. అలా చేస్తే, మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే’’ అని చెప్పారు. ‘‘చాలామంది పాక్ అనుకూల వ్యక్తులు నిరంతరాయంగా మోడీని వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికీ చెబుతున్నాను. ఈ దేశం హృదయపూర్వకంగా భారతీయులకు చెందినదే. కానీ భారత వ్యతిరేకులను పాక్ ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది’’ అని గిరిరాజ్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. -
ఆయన్ను కాదంటే.. ఇండియాలో ఉండొద్దు!
బీజేపీలో మోడీ మేనియా విపరీతంగా పెరిగిపోతోంది. పార్టీ కన్నా మోడీనే ఎక్కువ అనే స్థాయికి చేరింది. తాజాగా అది మరింత పెరిగి మోడీని ఏమైనా అంటే దేశ బహిష్కరణే అనేంత స్థాయికి చేరింది. జార్ఖండ్‌లో ఒక ఎన్నికల సభలో శనివారం బీహార్‌కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మోడీని వ్యతిరేకించేవారికి ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తరువాత దేశంలో స్థానం లేదంటూ తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. ‘మోడీ ప్రధానమంత్రి కాకుండా ఆపాలనుకునేవారికి పాకిస్థానే గతి. వారికి ఇండియాలో స్థానం లేదు. వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందే’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలను బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సమక్షంలోనే చేయడం గమనార్హం.