విద్యుత్, నిరుద్యోగమే పెద్ద సమస్యలు | Unemployment and power to be major problems in uttarpradesh | Sakshi
Sakshi News home page

విద్యుత్, నిరుద్యోగమే పెద్ద సమస్యలు

Feb 10 2017 4:19 PM | Updated on Sep 5 2017 3:23 AM

విద్యుత్, నిరుద్యోగమే పెద్ద సమస్యలు

విద్యుత్, నిరుద్యోగమే పెద్ద సమస్యలు

రేపు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 13.80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

లక్నో: రేపు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 13.80 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే, ఉత్తర అమెరికా దేశమైన మెక్సికో జనాభాకన్నా ఎక్కువ మంది ఓటర్లు. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేవంటూ ‘ఫోర్త్‌లైన్‌ టెక్నాలజీస్‌’ ఓ సర్వే జరపగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్‌ అంటూ దాదాపు మూడోవంతు మంది ఓటర్లు చెప్పారు. 
 
నిరుద్యోగ సమస్య, ఆర్థిక పరిస్థితి, అభివద్ధి ప్రధానాంశాలని 20 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. రక్షిత మంచినీరు లేవని పది శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, సరైన రోడ్లు, ఆహారం, పెద్ద నోట్ల రద్దు, నేరాలు, అవినీతి, వ్యవసాయం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య ప్రధాన సమస్యలని చాలా తక్కువ మంది పేర్కొన్నారు. ఓ 17 శాతం మంది ప్రజలు ఇతర సమస్యలను ఉదహరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్లణ ప్రాంతాల్లోని  వివిధ వర్గాలకు చెందిన 2,513 మంది ఓటర్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఫోర్త్‌లైన్‌ టెక్నాలజీస్‌ ఈ అధ్యయనం జరిపింది. వారిలో 28 శాతం మంది విద్యుత్‌యే తమకు అతి పెద్ద సమస్యని తెలిపారు. 
 
2001 లెక్కల ప్రకారం 31.9 శాతం ఇళ్లలో ప్రధాన ఇంధన వనరు విద్యుత్‌కాగా 2011 జనాభా లెక్కల నాటికి ఆది 36.8 శాతం ఇళ్లకు పెరిగింది. 2011 నాటికి పట్టణాల్లో 81.4 శాతం ఇళ్లు విద్యుత్‌ను ఉపయోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 23.7 శాతం ఇళ్లు మాత్రమే విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 2016 సంవత్సరం ముగిసేనాటికి గ్రామీణ ప్రాంతాల్లో 1,77,000 ఇళ్లుకు విద్యుత్‌ సౌకర్యం లేదు. విద్యుత్‌ సౌకర్యం ఉన్నవారు కూడా ఎక్కువగా కరెంట్‌ కోతల వల్లన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు కరెంటు పోతుందని 58 శాతం మంది ఓటర్లు వెల్లడించగా, వారానికోసారి పోతుందని 16 శాతం మంది తెలిపారు. పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్‌ కోతల సమస్య ఎక్కువగా ఉంది. 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగం మరో పెద్ద సమస్య. దేశవ్యాప్తంగా వర్కింగ్‌ ఏజ్‌ సరాసరి 37 ఏళ్లు ఉండగా, యూపీలో 52 ఏళ్లుగా ఉంది. ప్రతి వెయ్యి మందికి 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య 300లకు పైగానే ఉందని రాష్ట్ర కార్మిక శాఖ 2015–16 సంవత్సరానికి వేసిన అంచనాలే తెలియజేస్తున్నాయి. డిగ్రీ, పీజీలు చేసిన వారు కూడా ఇక్కడ నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యి మందిలో 237 మంది డిగ్రీ చదివిన నిరుద్యోగులున్నారు.  విద్యా ప్రమాణాలు తక్కువగా ఉండడం అందుకు ప్రధాన కారణం. సాఫ్ట్‌వేర్‌ రంగం లేదా కోర్‌ ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలను 97 శాతం మంది అభ్యర్థులు కోరుకున్నట్లయితే వారిలో మూడు శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను, ఏడు శాతం మంది ఇతర కోర్‌ ఇంజనీరింగ్‌ జాబ్‌లను పొందకలుగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement