మరో జాతి వారి ఇంటిలో విందు భోజనమే నేరం!

Two Women Punished For Feasting In Other Caste House In Orissa - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : కులమతాలకు అతీతంగా నేడు వివాహాలు జరుగుతున్నాయి. విందులు, వినోదాలలో అన్ని మతాలు, కులాల వారు ఏ భేదం లేకుండా కలిసి భోజనాలు చేస్తున్నారు. అయితే అవిభక్త కొరాపుట్‌లో మాత్రం నేటికీ ఈ కుల మత భేదాలు, జాతి పట్టుదలలు కొనసాగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలలో ఒక జాతి వారు మరో జాతి వారి ఇంట్లో భోజనం చేయడం పెద్ద తప్పు. అలా చేస్తే వారిని వెలివేయడమో లేదా వారికి కఠిన దండన విధించడమో చేస్తారు. ఈ దురాచారం నేటికీ కొన్ని ప్రాంతాలలో అమలులో ఉంది. ఒరిస్సా, కొరాపుట్‌ జిల్లా జయపురం సమితి బదిలిగుడ గ్రామానికి చెందిన అర్జున మాలి ఈ నెల 11 వ తేదీన మరణించాడు. ( మహానదిలో పురాతన ఆలయం)

ఆయనకు కుమారులు లేరు. ఉన్నది ఇద్దరు కుమార్తెలు. కొడుకు లేకపోవడం వల్ల తండ్రి దహన సంస్కారాల బాధ్యత ఇద్దరు కుమార్తెల పైన పడింది. అయితే ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల ఒక గదబ సామాజిక కుటుంబం వారి విందులో పాల్గొని భోజనం చేశారని అందుచేత వారు జాతిని కోల్పోయారని మళ్లీ జాతిలో చేరి తండ్రి అంత్యకియలు జరపాలంటే శిక్ష అనుభవించాలని పెద్దలు తీర్పు చెప్పారు. 

శిక్ష అనుభవించాక దహన సంస్కారాలు
అందుకు అక్కాచెల్లెళ్లు అంగీకరించారు. పెద్దల తీరానం మేరకు ఆ ఇద్దరి యువతులకు గుండు గీశారు. గుండు గీసిన అనంతరం గ్రామ పెద్దలు వారి తండ్రి దహన సంస్కరాలు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ సంఘటనపై అవిభక్త కొరాపుట్‌ జిల్లా మాలీ సమాజ్‌  వికాస్‌ పరిషత్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు నవరంగపూర్‌ సబ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రౌత్‌ను కలిసి  సంఘటనపై దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top