అంబులెన్స్‌ డ్రైవర్‌ని చితకబాదిన ఖాకీలు

Tripura Police Attack Ambulance - Sakshi

అగర్తల : అంబులెన్స్‌ వస్తోందంటే దానికి దారి వదలడం కనీస మానవ ధర్మం. మనం చేసే ఆ కాస్త సాయం విలువ ఓ మనిషి ప్రాణం. కానీ నేటి ఉరుకులపరుగుల జీవితాల్లో ఈ విషయం గురించి పట్టించుకునేంత తీరిక ఎవరికి ఉండటం లేదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడమే పెద్ద బాధ్యతారాహిత్యం అనుకుంటే.. క్షతగాత్రులను తీసుకెళ్లే అంబులెన్స్‌ మీద దాడి చేయడం మరీ దారుణం. ఇక్కడ ఇంతకంటే బాధకరమైన విషయం ఏంటంటే అలా దాడి చేసిన వారు పోలీసులు కావడం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌​ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల ఎనిమిదిన త్రిపురలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జనాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ‘త్రిపుర స్టేట్‌ రైఫిల్స్‌ టీమ్‌’ను రంగంలోకి దింపింది. ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దాంతో సిబ్బంది.. ఆందోళనకారుల మీద దాడి చేయడమే కాక కాల్పులు కూడా జరిపారు. ఈ దాడుల్లో గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో పోలీసులు అంబులెన్స్‌ మీద విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఊరుకోక అంబులెన్స్‌ డ్రైవర్‌ని కూడా చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని గురించి పోలీసు అధికారులను వివరణ కోరగా.. ఈ వీడియోల గురించి తమకు తెలియదని.. ఇంకా వీటిని తాము చూడలేదని తెలిపారు. అంతేకాక తమ అధికారులేవరూ అంబులెన్స్‌ మీద దాడి చేయరంటూ వివరణ ఇచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top