వామపక్ష రాష్ట్రంలో యోగా తప్పనిసరి

వామపక్ష రాష్ట్రంలో యోగా తప్పనిసరి - Sakshi


అది ఓ వామపక్ష పాలిత రాష్ట్రం. అయినా అక్కడి విద్యార్థులకు యోగా తప్పనిసరి చేశారు. గుజరాత్ తర్వాత అలా చేసిన ఏకైక రాష్ట్రం.. త్రిపుర! అవును.. జనవరి 1 నుంచి ఆ రాష్ట్రంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిదశలో రాష్ట్రంలోని వంద స్కూళ్లలో దీన్ని అమలుచేస్తామని, క్రమంగా అన్నింటికీ విస్తరిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తపన్ చక్రవర్తి చెప్పారు. పట్టణ, గ్రామీణ, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఈఈడీసీ) ప్రాంతాల నుంచి ఈ స్కూళ్లను ఎన్నుకుంటారు.



ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను నేర్పిస్తామని తపన్ చక్రవర్తి తెలిపారు. దీనివల్ల భావితరాలు క్రమశిక్షణతో ఉంటాయని ఆయన అన్నారు. ముందుగా కొంతమంది టీచర్లకు యోగాలో శిక్షణ ఇప్పిస్తామని, వాళ్లు పిల్లలకు నేర్పిస్తారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం అనవసరమని కొట్టిపారేస్తున్నారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని మంచి చేసుకోడానికే యోగా ప్రవేశపెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర బీజేపీ వర్గాలు మాత్రం.. ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top