రాళ్ల పండుగ.. 400 మందికి గాయాలు

Traditional Stone Festival In Chhindwara District Madya Pradesh - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో శనివారం జరిగిన రాళ్ల పండుగలో 400 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలవడంతో పాటు ఇద్దరు కంటి చూపు దెబ్బతిన్నట్లు స్థానిక ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రతి ఏడాది ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకునే సంప్రదాయం 400 ఏళ్లుగా కొనసాగుతుంది. 

జామ్‌ నదికి ఇరువైపులా ఉన్న పంధూర్నా, సవర్గాన్‌ గ్రామాల ప్రజలు నదీ తీరానికి చేరుకొని రెండు బృందాలుగా ఏర్పడి నది మధ్యలో ఏర్పాటు చేసిన జెండాను ఒడ్డుకు తెచ్చేందుకు పోటీపడతారు. దీనినే గోట్‌మార్‌ పండుగ అని పిలుస్తారు. 'గోట్‌' అంటే అక్కడి స్థానిక భాషలో రాయి అని, 'మార్‌' అంటే కొట్టు అని అర్థం. పోటీలో భాగంగా జెండా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు మరో వర్గం రాళ్లతో కొడుతూ వెనక్కు తరుముతారు. కాగా ఈ సారి జరిగిన వేడుకలో పంధుర్నా గ్రామానికి చెందిన వారు జెండాను ఒడ్డుకు తీసుకురావడంతో వారిని విజేతలుగా ప్రకటించారు.

400 ఏళ్ల చరిత్ర
ఈ గోట్‌మార్‌ పండుగ వెనుక 400 వందల ఏళ్ల చరిత్ర  ఉన్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.  400 సంవత్సరాల క్రితం జామ్‌ నదికి ఓ వైపున ఉన్న సవర్గాన్‌ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడి అమ్మాయిని తీసుకొని పారిపోతుంటే ఊరివాళ్లు వెంబడించారని, వారు నది దాటుతుండగా రాళ్లతో కొట్టినట్లు స్థానికులు చెబుతారు. ఇది గమనించిన పంధూర్నా గ్రామస్తులు ఆ జంటను కాపాడారని అంటుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

ఇదే విషయమై ఎస్పీ మనోజ్‌రాయ్‌ మాట్లాడుతూ..' ప్రతీ ఏటా అక్కడివారు జరుపుకునే సంప్రదాయ పండుగని , రాళ్లతో కొట్టుకునే సంప్రదాయాన్ని ఆపడం సాధ్యం కాదని, అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని' పేర్కొన్నారు. గోట్‌మార్‌ పండుగ మొత్తాన్ని సీసీటీవీ, డ్రోన్లతో చిత్రీకరించినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top