బెంగాల్‌లో బంద్‌ హింసాత్మకం

Trade unions strike hits road in west bengal - Sakshi

బస్సులు, వాహనాలకు ఆందోళనకారుల నిప్పు

పలుచోట్ల ఘర్షణలు

కోల్‌కతా: ట్రేడ్‌ యూనియన్ల పిలుపు మేరకు బుధవారం జరిగిన భారత్‌ బంద్‌ బెంగాల్‌లో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు బలవంతంగా బంద్‌ చేయించారు. పలు ప్రాంతాల్లో బస్సులు, పోలీస్‌ వాహనాలు ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే లైన్లపై ఆందోళనలు జరగడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మాల్డాలోని సుజాపూర్, బుర్ద్వాన్‌ జిల్లాలో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం, టైర్లు కాల్చేయడంతోపాటు ప్రభుత్వ బస్సులతోపాటు ఒక పోలీస్‌ వ్యాన్‌సహా పలు ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపై నాటుబాంబులతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్‌కు పాల్పడగా, మరికొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారాసాత్, నార్త్‌ 24 పరగణ ప్రాంతాల్లోని కొన్ని రైల్వే ట్రాక్‌లపై పోలీసులు కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top