బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఒక టోల్ ఫ్రీ నెంబరును కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ ఇన్సిస్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రిసెర్చ్ గురువారం లాంచ్ చేసింది.
చెన్నై: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఒక టోల్ ఫ్రీ నెంబరును కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ ఇన్సిస్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రిసెర్చ్ గురువారం లాంచ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి టోల్ ఫ్రీ నంబరును లాంచ్ చేశామని సంస్థ తెలిపింది. 1800 2700 703 అనే నంబరుకు కాల్ చేసి ఇంగ్లీషు, తమిళ భాషల్లో సమాచారాన్ని తెలుసుకోవచ్చని సంస్థ డైరెక్టర్ డా. పి. గుహన్, తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రమాదాలు, నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా పద్ధతులు మొదలైన వివరాలను తెలుసుకోవచ్చన్నారు. మనదేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనను అందించేందుకు వీలుగా ఈ టోల్ ఫ్రీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా గతంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించామన్నాని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఇందులో రెండు లక్షలమందికి పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 56 మంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించామని తెలిపారు. వ్యాధిపై పూర్తిగా అవగాహన లేకపోవడ వల్లే మరింత ప్రమాదం ముంచుకొస్తోందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే చికిత్స చాలా సులభమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే దాదాపు అయిదు లక్షల పోస్టర్లను ముద్రిస్తున్నామన్నారు. దీంతో పాటు మహిళల కోసం ఈ నెలాఖరువరకు( అక్టోబర్ 31) ఉచిత మమ్మోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు.