‘రోడ్డు’ నేరస్తులపై కొరడా! | Sakshi
Sakshi News home page

‘రోడ్డు’ నేరస్తులపై కొరడా!

Published Sun, Sep 14 2014 1:58 AM

‘రోడ్డు’ నేరస్తులపై కొరడా! - Sakshi

ప్రమాదాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలుశిక్ష
- పిల్లలు మరణిస్తే రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు
- కొత్త మోటారు వాహనాల బిల్లులో ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: దేశంలో ఏటా లక్షన్నర మందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలకు, వాటికి కారణమయ్యే వారికి చెక్ పెట్టేందుకు కేంద్రం కొరడా ఝళిపించనుంది. రహదారి భద్రత పెంచి, నిబంధనలు ఉల్లంఘించే నేరస్తులపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త మోటారు వాహనాల బిల్లును ప్రతిపాదించింది. ఇందులో భారీ జరిమానాలు, ఏడేళ్లకుపైగా జైలు శిక్ష, వాహనాల జప్తు, డ్రైవింగ్ లెసైన్సుల రద్దు తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ‘కొత్త రోడ్డు భద్రత, రవాణా బిల్లు-2014’ పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మం త్రిత్వ శాఖ శనివారం దీన్ని విడుదల చేసింది. ప్రజల నుంచి, సంబంధిత రంగాల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు దీని వివరాలు వెల్లడించింది. సలహాలు స్వీకరించాక బిల్లును ఖరారు చేసి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు.
 
బిల్లులోని ముఖ్య ప్రతిపాదనలు..

కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదంలో పిల్లల మృతికి కారణమైతే నేరస్తుడికి రూ. 3 లక్షల జరిమానా, ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష.
వాహనాల తయారీ డిజైన్‌లో లోపాలుంటే ఒక్కో వాహనానికి రూ. 5 లక్షల జరిమానా, జైలుశిక్ష. వాహనాలను సురక్షితంకాని పరిస్థితుల్లో నడిపితే రూ. 1 లక్షవరకు జరిమానా, లేదా ఆరు నెలల నుంచి ఏడాది జైలుశిక్ష, లేదా ఇవి రెండూ.
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే(తొలి నేరం కింద) రూ.25 వేల జరిమానా, లేదా మూడు నెలలకు మించని జైలుశిక్ష, లేదా ఇవి రెండూ, ఆరు నెలలు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్. మూడేళ్లలోపు రెండోసారి ఈ నేరానికి పాల్పడితే రూ. 50వేల పెనాల్టీ, లేదా ఏడాది జైలు శిక్ష, లేదా ఇవి రెండూ. వీటితోపాటు లెసైన్స్ ఏడాది సస్పెన్షన్. తర్వాత కూడా డ్రంక్ డ్రైవింగ్ చేస్తే లెసైన్స్ రద్దు, 30 రోజుల వరకు వాహనం జప్తు.
స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం తాగి నడిపితే రూ. 50 వేల జరిమానా, మూడేళ్లవరకు జైలుశిక్ష. 18-25 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఇలాంటి నేరానికి పాల్పడితే వెంటనే లెసైన్స్ రద్దు. జరిమానాల విధింపు కోసం గ్రేడెడ్ పాయింట్ వ్యవస్థ.  
ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే రూ. 15 వేల జరిమానా. నెలపాటు లెసైన్స్ రద్దు, తప్పనిసరిగా తాజా డ్రైవింగ్ శిక్షణ. పదేపదే ప్రమాదాలకు కారణమయ్యేవారిని గుర్తించేందుకు ఎలక్ట్రానిక్ డిటెక్షన్, కేంద్రీకృత నేర సమాచార వ్యవస్థ. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద సీసీటీవీలు. వాహనాల్లో వేగ నియంత్రణ, డ్రైవర్ల నిద్రమత్తు గుర్తింపు తదితర భద్రతా పరికరాల ఏర్పాటు.
ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి గంటలోనే(గోల్డెన్ అవర్) నగదు రహిత చికిత్స మోటార్ యాక్సిడెంట్ ఫండ్ ఏర్పాటు. దీనికింద.. రోడ్డు వాడుకునే వారందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తెస్తారు.  క్షతగాత్రులు, ప్రమాద మృతుల బంధువులు దీన్నుంచి డబ్బు కోరవచ్చు.

లక్ష్యాలు..
 వచ్చే ఐదేళ్లలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను రెండు లక్షలమేర తగ్గించడం. ప్రస్తుతం ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగుతుండగా, 1.4 లక్షల మంది చనిపోతున్నారు.
స్వతంత్రప్రతిపత్తిగల మోటారు వాహనాల నియంత్రణ- రోడ్డు భద్రత ప్రాధికార సంస్థ ఏర్పాటు. వాహనాలకు సంబంధించి మెరుగైన డిజైన్లు. భారీవాహనాల రీడిజైనింగ్.
డ్రైవింగ్ లెసైన్సుల జారీకి సింగిల్‌విండో ఆటోమేటెడ్ వ్యవస్థ. ఆటోమేటెడ్ డ్రైవింగ్ పరీక్ష, నకిలీ లెసైన్సుల నియంత్రణకు బయోమెట్రిక్ విధానం. వాహనాల తయారీదారులు, రవాణా విభాగాలు, బీమా కంపెనీల కోసం సమగ్ర డేటాబేస్. సులభంగా వాహనాల బదిలీ.
వాహనాల ఏకీకృత రిజిస్ట్రేషన్ వ్యవస్థ, నేషనల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్-మల్టీనేషనల్ కోఆర్డినేషన్ అథారిటీ, జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ కోసం హైవే ట్రాఫిక్ రెగ్యులేషన్-ప్రొటెక్షన్ ఫోర్స్. గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్-నేషనల్ ఫ్రైట్ పాలసీ.
రోడ్డు రవాణా సామర్థ్యం, భద్రత పెంపుతో స్థూల జాతీయోత్పత్తి 4 శాతం పెరుగుతుందని అంచనా. ఈ రంగంలో పెట్టుబడుల పెంపు ద్వారా 10 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.
అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, సింగపూర్, జపాన్, బ్రిటన్, జర్మనీల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు అనుగుణంగా ఈ బిల్లు రూపొందించారు.
కాగా, వేగం, సామర్థ్యం, సురక్షితం, లాభదాయకమైన రవాణా వ్యవస్థను నెలకొల్పడం ఈ బిల్లు లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ రంగంలో పారదర్శకత కోసం ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిచ్చామన్నారు. యాక్సిడెంట్ నిధితో ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందుతుందని, లక్షలాది ప్రాణాలను కాపాడొడచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement