వార్షికాదాయం 9 లక్షలు దాటినా పన్ను లేదు!

There is no tax on above 9 lakhs - Sakshi

మినహాయింపులు సరిగ్గా వినియోగించుకుంటే చాలు

బడ్జెట్‌ నిర్ణయంతో ఎగువ మధ్యతరగతికీ ఉపశమనమే  

సాక్షి బిజినెస్‌ డెస్క్‌: ఈ బడ్జెట్‌లో సెక్షన్‌ 87–ఏ కింద లభించే పన్ను రిబేటును పెంచడంతో చిన్న వేతనజీవుల నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతోంది. ఈ రిబేటుతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర పన్నుమిన హాయింపులను కూడా పూర్తిగా వినియోగిం చుకుంటే రూ.10 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో రూ.3.50 లక్షలలోపు పన్ను ఆదాయంపై రూ.2,500 పన్ను రిబేటు లభించేది. ఇప్పడు ఈ రిబేటును రూ.5 లక్షల పన్ను ఆదాయంపై రూ.12,500కు పెంచారు. ఇప్పుడు వీటికి అదనంగా సెక్షన్‌ 80–సీ కింద లభించే రూ.1.50 లక్షలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, గృహ రుణానికి చెల్లించే వడ్డీ రూ.2,00,000, ఎన్‌పీఎస్‌కు చెల్లించే రూ.50 వేలు పన్ను మినహాయింపులను వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం వచ్చేవారు కూడా ఒక్క రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పన్ను ఆదాయం (టాక్సబుల్‌ ఇన్‌కమ్‌) రూ.5,00,000 కన్నా ఒక్క రూపాయి దాటినా ఈ రిబేటు వర్తించదు. అప్పుడు ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను లెక్కించి చెల్లించాల్సిందే. ఈ రిబేటును పెంచడంతో వార్షిక ఆదాయం రూ.5.50 లక్షలలోపు ఉన్న వారు ఎటువంటి పొదుపు చేయాల్సిన అవసరం లేకుండానే పన్ను భారం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు.

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం గలవారికి నేరుగా రూ. 12,500 మేర రిబేటు లభిస్తుందని, దీంతో వారిపై పన్ను భారం ప్రసక్తి ఉండదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ సుశీల్‌ చంద్ర తెలిపారు. వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి మాత్రం ’పాత’ పన్ను రేట్లు యథాప్రకారం కొనసాగుతాయన్నారు. అయితే పీపీఎఫ్, జీపీఎఫ్, బీమా పథకాలు, మొదలైన వాటిల్లో రూ. 1.5 లక్షల దాకా ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో రూ. 6.5 లక్షల వార్షికాదాయ వర్గాలూ పన్ను రిబేటు ప్రయోజనాలు పొందవచ్చని సుశీల్‌ వివరించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంచడంతో వేతన జీవులకు మరో రూ. 10 వేల మేర అదనపు ప్రయోజనమూ లభిస్తుందన్నారు. దీంతో సుమారు 3 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందగలరన్న సుశీల్‌ చంద్ర.. ఖజానాకు మాత్రం రూ. 4,700 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందన్నారు. రూ. 5 లక్షల దాకా ఆదాయవర్గాలకు రిబేట్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 18,500 కోట్ల దాకా ఆదాయం పోతుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top