సీఎం విమానం ల్యాండింగ్‌ వివాదం, పైలట్లపై వేటు | Sakshi
Sakshi News home page

సీఎం విమానం ల్యాండింగ్‌ వివాదం, పైలట్లపై వేటు

Published Wed, Dec 7 2016 10:06 AM

సీఎం విమానం ల్యాండింగ్‌ వివాదం, పైలట్లపై వేటు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు సంబంధించి ఇటీవల ఏర్పడిన గందరగోళం విషయంలో ఆరుగురు పైలట్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇండిగో, స్పైస్‌ జెట్‌, ఎయిర్‌ ఇండియా విమాన సంస్థలకు చెందిన ఆరుగురు పైలట్లపై వేటు వేస్తూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఒక్కో విమాన సంస్థ నుంచి ఇద్దరు పైలట్లపై వేటు పడింది. మమత ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొల్‌కతా విమానాశ్రయంలో 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే.

బిహార్‌లో నవంబర్‌ 30న ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ  నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది.

అయితే మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తి గందరగోళం సృష్టించారు. దీనిపై సంబంధిత మంత్రి వివరణ ఇస్తూ.. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం ఆలస్యమైందని తెలిపారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లపై వేటు వేసింది. కాగా.. పైలట్ల సస్పెన్షన్‌పై విమాన సంస్థలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement