
బెంగళూరులో కుప్పకూలిన భవనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు.
- ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
- నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటం వల్లే!
సాక్షి, బెంగళూరు/ కేఆర్ పురం: కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. మహదేవపుర నియోజకవర్గం బెలందూరు గేట్ వద్ద 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వినయ్‌కుమార్ దేంగుల, మరో ఐదుగురు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నుంచి అనుమతి పొందారు. నగరానికి చెందిన ఆర్‌కే అసోసియేట్స్‌కు నిర్మాణబాధ్యతలు అప్పగించారు. నిర్మా ణం చివరి దశలో ఉన్న ఈ భవనం బుధవారం సాయంత్రం ఎడమ వైపునకు కూలి పోయింది. దీంతో శిథిలాలు పడి పక్కనే మరోభవనంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఒడిశా యువకుడు అశోక్‌కుమార్ (25) ఘటనాస్థలంలోనే మరణించగా మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటలకు శిథిలాల కింద మరొక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. శిథిలాల కింద ఉన్న వారిలో ఏడుగురిని రక్షించి.. స్థానిక సక్రా ఆసుపత్రికి తరలిం చగా అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు(18) అనే యువ కుడు మృతి చెందా డు. నిర్మాణంలో నాసిరకం సిమెంటు, ఇటుకలు, ఇసుక వాడటమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో ఉత్తమ చికిత్స అందిస్తామని తెలిపారు. భవన యాజమాన్య హక్కులు కలిగిన డీ వినయ్‌కుమార్‌తో సహా ఆరుగురిపైన, ఆర్‌కే అసోసియేట్స్‌కు చెందిన ఇంజనీర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు బీబీఎంపీ క మిషనర్ మంజునాథ్ ప్రసాద్ తెలిపారు.