దేశంలోకి ఉగ్రవాదులు? హై అలర్ట్‌ ప్రకటన

Terrorists Trying to Infiltrate Into India Via Nepal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు దాడులే లక్ష్యంగా ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్‌పూర్‌ సమీపంలోని ఇండో నేపాల్‌ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నాల్లో ఉన్నారంటూ నిఘావర్గాలు గురువారం హెచ్చరించాయి. దీపావళి పండుగ రోజు భారీ దాడులు చేయాలనే ప్రణాళికతో వారు ఉన్నారని వెల్లడించాయి. భారత్‌లో ప్రవేశించిన తర్వాత ఉగ్రవాదులకు కశ్మీర్‌లోని కొందరు వ్యక్తులు అవసరమైన సహాయమందిస్తారని వారి ఫోన్‌ సంభాషణలను బట్టి తెలుస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఫోన్‌లను ట్యాప్‌ చేసిన నిఘా విభాగం, లొకేషన్‌ ఆధారంగా చివరిసారిగా నేపాల్‌ సరిహద్దుల్లో వారిని గుర్తించినట్టు తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు పంజాబ్‌లోని రక్షణ స్థావరాలపై దాడి జరిగే అవకాశముందని బుధవారం నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వాయుసేన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ స్థావరంతో పాటు ఇతర ఎయిర్‌బేస్‌లలో ఆరెంజ్‌ నోటీసును జారీ చేసింది. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఉగ్రవాదులు ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలో ప్రవేశించారని నిఘా విభాగం తెలిపింది.

బంగ్లా సైనికుల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి
మత్స్యకారులను విడిపించేందుకు చర్చలకు వెళ్లిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై గురువారం బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌ కాల్పులు జరపడంతో ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. మరో కానిస్టేబుల్‌ గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముర్శీదాబాద్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకొంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న పద్మ నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను బంగ్లా బలగాలు తమ అదుపులోకి తీసుకొని అనంతరం ఇద్దరిని విడిచిపెట్టాయి. మిగిలిన ఒకరిని విడిపించడానికి బీఎస్‌ఎఫ్‌ అధికారులు బంగ్లా సైనికాధికారులతో చర్చలకు వెళ్లారు.

ఈ సందర్భంగా బంగ్లా సైనికులు భారత జవాన్లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెనుదిరిగిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై వెనుక నుంచి బంగ్లా సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌ భాన్‌ సింగ్‌ తలలో బుల్లెట్‌ దూసుకుపోగా, మరో బుల్లెట్‌ కానిస్టేబుల్‌ కుడి చేయి నుంచి వెళ్లింది. వీరిద్దరినీ సహచర జవాన్లు హాస్పిటల్‌కు తరలించగా, హెడ్‌ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఈ ఘటన పరిణామాలపై చర్చించేందుకు బంగ్లా సైనిక ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top