
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం విషయమై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలనుకుంటే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకోవాలంటూ జేసీ సూచించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ... ‘బ్రాహ్మణ యువతితో మీ కుమారుడి వివాహం జరిపిస్తే అతడు తప్పక పీఎం అవుతాడంటూ’ సోనియా గాంధీకి ఆయన సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఉన్నవారే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కచ్చితంగా ఆ రాష్ట్రానికే చెందిన బ్రాహ్మణ యువతితో రాహుల్ పెళ్లి జరగాలంటూ జేసీ వ్యాఖ్యానించారు.