‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు | Tamil Nadu Becomes the 5th State To Declare State Butterfly | Sakshi
Sakshi News home page

‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు

Aug 14 2019 6:04 PM | Updated on Aug 14 2019 7:52 PM

Tamil Nadu Becomes the 5th State To Declare State Butterfly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ఇటీవల రాష్ట్ర ప్రత్యేక సంస్కతి, ప్రకతి సంపదకు చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసింది. స్థానికంగా తమిళ మారవన్‌గా, అంటే తమిళ యోధుడిగా వ్యవహరించే ఈ సీతాకోక చిలుకను ఇంగ్లీషులో ‘కనోపీ బటర్‌ ఫ్లై’గా పిలుస్తారు. ఇది ముదురు పసుపు రంగు రెక్కలు కలిగి వాటిపై నాలుగైదేసి నల్లటి చుక్కలు ఉంటాయి. ‘నింఫాలిడ్‌’ జాతికి చెందిన ఈ సీతాకోక చిలుకలు సాధారణంగా 60 మిల్లీమీటర్ల నుంచి 75 మిల్లీ మీటర్ల వరకు ఉంటాయి. రాష్ట్ర చిహ్నంగా ఈ సీతాకోక చిలుకను ఎంపిక చేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగానికి కొన్నేళ్లు పట్టింది. తమిళ యోధుడిగా వ్యవహరిస్తున్నందున, పర్వత ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండడంతో ఈ రకం సీతాకోక చిలుకను ఎంపిక చేసినట్లు తెలిసింది. 

రాష్ట్రంలో అంతరించి పోతున్న 35 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవది. ఉత్తరాఖండ్‌ ‘కామన్‌ పీకాక్‌’గా వ్యవహరించే సీతాకోక చిలుకను ఎంపిక చేయగా (ఆకుపచ్చ రంగులో సిల్క్‌లాంటి రెక్కలు కలిగిన), కేరళ ‘మలబార్‌ పీకాక్‌ (మధ్యలో పాలపిట్ట రంగు, రెక్కల చివరన నలుపురంగు ఉండే)ను, కర్ణాటక ‘సదరన్‌ బర్డ్‌వింగ్స్‌ (మధ్యలో చీలి నాలుగు రెక్కలున్నట్లుగా రెండు రెక్కలుండే పలు రంగుల చిలుకలు)’ను, మహారాష్ట్ర ‘బ్లూ మార్మన్‌’ ముందు రెక్కలు ముదురు నీలి రంగులో ఉండి మధ్య భాగం తెలుపు, చివరి భాగంలో నీలి రంగుపై నలుపు చుక్కలు కలిగిన సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్నాయి. 

ఈ రాష్ట్రాలన్నీ కూడా కొండ ప్రాంతాలకు వన్నె తెచ్చే రంగు రంగుల సీతాకోక చిలుకల జాతులను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. పర్యావరణ పరిస్థితులను సూచిస్తాయి కనుక సీతాకోక చిలుకలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడి కాంతి, వేడి, గాలిలో తేమ, వర్షాలను అధికంగా ఇవి తట్టుకోలేవు. అలాంటి పరిస్థితుల్లో అవి వలసలు పోతాయి. అప్పుడు వాతావరణ పరిస్థితులను మనం స్పష్టంగా అంచనా వేయవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement