పెట్టుబడులు పెట్టండి! | Tamil Nadu and Singapore have a close relationship: Shanmugam | Sakshi
Sakshi News home page

పెట్టుబడులు పెట్టండి!

Jul 5 2014 2:21 AM | Updated on Jul 11 2019 8:48 PM

పెట్టుబడులు పెట్టండి! - Sakshi

పెట్టుబడులు పెట్టండి!

సింగపూర్ విదేశాంగ మంత్రి కే షణ్ముగం నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనను ముగించుకుని చెన్నైకు చేరుకుంది.

* విదేశీ సంస్థలకు సీఎం జయ పిలుపు
* సీఎంకు సింగపూర్ మంత్రి ఆహ్వానం
* రాష్ట్ర ప్రతినిధులతో భేటీ
 సాక్షి, చెన్నై: సింగపూర్ విదేశాంగ మంత్రి కే షణ్ముగం నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనను ముగించుకుని చెన్నైకు చేరుకుంది. గురువారం సచివాలయంలో ఈ బృందం తమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలితను కలుసుకుంది. వీరిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సీఎం జయలలిత సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం జయలలిత, సింగపూర్ విదేశాంగ మంత్రి కే షణ్ముగం నేతృత్వంలో తమిళనాడు అధికారులు, ఆ దేశ ప్రతినిధుల బృందం సమావేశం అయింది. ఇందులో ప్రధానంగా తమిళనాడులో పెట్టుబడులే లక్ష్యంగా సమీక్ష సాగింది.
 
విజన్‌కు తోడ్పాటు: తమిళనాడు ప్రభుత్వ బృహత్తర పథకం విజన్ -2023 గురించి సీఎం జయలలిత వివరించారు. రూ. 15 లక్షల కోట్ల వ్యయంతో ఈ విజన్ సాగనున్నదని, విదేశీ సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్టు ప్రకటించారు. కొరియ, జపాన్ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు చెన్నైలో పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. విదేశీ పెట్టుబడులకు తమిళనాడు అనువైన ప్రదేశంగా వివరించారు.

ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా కల్పించే రాయితీలు, అంది పుచ్చుకునే అవకాశాలు, తదితర అంశాలను విశదీకరించారు. సంస్కృతి సంప్రదాయాలు, భాషా పరంగా తమిళనాడు, సింగపూర్‌లు రెండు ఒకటేనని గుర్తు చేశారు. తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా ఇక్కడ పెట్టుబడులు, అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం మరింత పెరగాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నదని వివరిస్తూ, రాష్ర్టంలోని సముద్ర తీరాల ప్రగతి, రోడ్ల విస్తరణ, తదితర అంశాలపై సింగపూర్ సంస్థలు దృష్టి పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజన్ 2023 సాకారంతో దేశంలోనే ఆదర్శ రాష్టంగా, అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తమిళనాడు అవతరించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి సంస్థల సహకారం, విదేశీ పెట్టుబడులు అవసరం అని చెప్పారు.
 
సింగపూర్‌కు రండి : తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని కే షణ్ముగం పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ దేశానికి రావాలని ఆహ్వానించామన్నారు. అక్కడ ఆయా సంస్థలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో 37 స్థానాలను కైవశం చేసుకున్న సీఎం జయలలితకు తమ దేశ ప్రధాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయమన్నారని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, కార్మిక శాఖ మంత్రి పి తంగమణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, ప్రభుత్వ సలహాదారుడు షీలా బాలకృష్ణన్‌తో పాటుగా పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement