సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్‌ నాగేశ్వరరావుకు సమన్లు

Supreme Court Summons CBIs Nageshwar Rao For Contempt Of Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది మోదీ ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నియమించిన ఎం నాగేశ్వరరావుకు గురువారం సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 12న న్యాయస్ధానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలి చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. తన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీబీఐ ప్రాసిక్యూషన్‌ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌ ఎస్‌ వాసూరాంను కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. ఏకే శర్మ బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల పేర్లను ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. 

ఈ సందర్భంగా సీజేఐ రంజన్‌ గొగొయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఢిల్లీసాకేత్‌ పోక్సో కోర్టుకు బదిలీ చేయడమే కాకుండా, విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ముజఫర్‌పూర్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్‌ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top