Interim Boss
-
నాగేశ్వరరావుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది మోదీ ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నియమించిన ఎం నాగేశ్వరరావుకు గురువారం సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 12న న్యాయస్ధానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలి చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. తన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీబీఐ ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎస్ వాసూరాంను కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఏకే శర్మ బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల పేర్లను ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఢిల్లీసాకేత్ పోక్సో కోర్టుకు బదిలీ చేయడమే కాకుండా, విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ముజఫర్‌పూర్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
టాటా గ్రూప్‌లో భారీ సంచలనం
ముంబయి: ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థ టాటా సన్స్‌లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజి మిస్త్రీని విధుల నుంచి తప్పించారు. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి చైర్మన్ ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. సోమవారం నిర్వహించిన బోర్టు సమావేశంలో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సైరస్ మిస్త్రీ నాలుగు సంవత్సరాలపాటు టాటా సన్స్‌కు చైర్మన్ గా పనిచేశారు. తొలిసారి 2012 డిసెంబర్ 28న ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సైరస్ ఐరిష్ జాతీయుడు. పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.