‘మోదీ ముడుపుల’ పిటిషన్‌ కొట్టివేత | Sakshi
Sakshi News home page

‘మోదీ ముడుపుల’ పిటిషన్‌ కొట్టివేత

Published Thu, Jan 12 2017 2:35 AM

‘మోదీ ముడుపుల’ పిటిషన్‌ కొట్టివేత - Sakshi

బిర్లా, సహారా గ్రూపుల నుంచి మోదీ ముడుపులు స్వీకరించారనడానికి
సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టేసిన సుప్రీంకోర్టు
  

న్యూఢిల్లీ: బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ముడుపులు స్వీకరించారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ద్వారా విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్‌దారు సమర్పించిన సాక్ష్యాధారాలకు విచారణార్హత లేదంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ‘కామన్‌ కాజ్‌ ’ సంస్థ తరఫున వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్‌ ప్రింటవుట్లు,  సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు.

వాటిని పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు, విచారణకు ఆదేశించలేం.  అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. సహారా గ్రూప్‌నకు సంబంధించి పిటిషన్‌ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్‌ కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో న్యాయప్రక్రియ దుర్వినియోగమయ్యే వీలుందని వ్యాఖ్యానించింది.

Advertisement
 
Advertisement