బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court Orders Gujarat Govt To Pay 50 Lakh Rs To Victim Who Lost Everything In 2002 Riots - Sakshi

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2002లో చెలరేగిన అల్లర్లలో భాగంగా సర్వం కోల్పోయిన ఆమెకు పరిహారంగా రూ. 50 లక్షలు చెల్లించాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా ఆమె జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆశ్రయం కూడా కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్‌లో 2002లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాహోద్‌ సమీపంలోని రాధిక్‌పూర్‌ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబంపై మూకదాడి జరిగింది. కుటుంబ యజమాని బిల్కిస్‌ యాకూబ్‌ రసూల్‌, అతడి భార్య బానో మినహా మిగిలిన 13 మందిని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురు సలేహ తలను బండకు బాది హత్య చేసిన అనంతరం.. బానో కూడా చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బానో స్థానికుల సహాయంతో ప్రాణాలు దక్కించుకుంది.

ఇక 2008లో బిల్కిస్‌ బానో అత్యాచార కేసులో 11 మందిని బాంబే హైకోర్టు దోషులుగా తేల్చింది. అయితే తన విషయంలో కొంతమంది పోలీసు అధికారులు నిందితులకు అనుకూలంగా వ్యవహరించి.. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారంటూ బానో కోర్టును ఆశ్రయించింది. అదే విధంగా తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ కేసును విచారించిన ఐదుగురు అధికారుల్లో నలుగురు రిటైర్డు కావడంతో వారికి పెన్షన్‌ అందకుండా మాత్రమే చేయగలిగామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వీరితో పాటు ఈ కేసును విచారించిన మరో అధికారి ప్రస్తుతం డీసీపీగా విధులు నిర్వర్తిస్తుండగా అతడిని డిమోట్‌ చేసినట్లు పేర్కొంది.

చదవండి : బిల్కిస్‌ బానో... గుజరాత్‌ గాయం.. కోర్టు తీర్పులు
బిల్కిస్‌ బానో... 2002 గుజరాత్‌ మారణహోమం ఉదంతాలను అనుసరించినవారికి తప్పనిసరిగా గుర్తుండే పేరు. మే 4 న ముంబై హైకోర్టు ఆమెపై పాశవికదాడి చేసిన 11 మందికి ట్రయల్‌ కోర్టు వేసిన శిక్షను ఖరారు పరిచింది. అంతేకాదు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఏడు మంది పోలీసులను, డాక్టర్లను కూడా దోషులుగా తేల్చింది. బిల్కిస్‌బానుకు సంబంధించి మాత్రమే కాదు గుజరాత్‌ మారణకాండకు సంబంధించి కూడా ఇది ముఖ్యమైన తీర్పు.

గర్భిణిపై అత్యాచారం చేసి పసిబిడ్డను చంపి...
2002లో గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధిక్‌పూర్‌ గ్రామంలో భర్తతో పాటు నివసిస్తున్న బిల్కిస్‌బానుకు అప్పుడు వయసు 18. గుజరాత్‌ అల్లర్లు ఆ ఊరికి కూడా పాకడంతో అప్పటికే చుట్టుపక్కల ఉన్న 60 ముస్లిం కుటుంబాల ఇళ్లను తగులబెట్టారు. బాధితులతో పాటు బిల్కిస్‌ కూడా తన కుటుంబంతో పొలాలలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె గర్భవతి. మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. రెండు మూడు రోజులు వారు ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో పొదల్లో ప్రాణాలు కాపాడుకుని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోదామనుకున్నారు. మార్చి 3, 2002న ఒక మట్టి మార్గం గుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెండు ట్రక్కుల్లో ముష్కరులు ‘చంపండి... నరకండి’ అని నినాదాలు ఇస్తూ వాళ్లను చుట్టుముట్టారు. బిల్కిస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

‘వాళ్లంతా మా ఊరి వాళ్లే. చిన్నప్పటి నుంచి నేను చూసినవాళ్లే. వాళ్లే నా పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు’ అని మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బిల్కిస్‌ ఉద్వేగభరితమైంది. ‘వాళ్లు మొత్తం 11 మంది. ఒకడు ఆమె చేతిలోని మూడేళ్ల కుమార్తెను నేలకు కొట్టి అప్పటికప్పుడు చంపేశాడు. మిగిలినవారంతా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పూనుకున్నారు. ‘నేను గర్భవతిని వదిలేయండి అంటున్నా వాళ్లు వినలేదు’ అంది బిల్కిస్‌. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 13 మందిని దారుణంగా చంపేశారు. అపస్మారకంలో పడి ఉన్న బిల్కిస్‌ ఆ తర్వాత మూడు రోజులకు కోలుకుని శరణార్థుల శిబిరంలో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది.

పట్టించుకోని పోలీసులు...
అయితే స్థానిక పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దోషులను అరెస్టు చేయండి అంటే వినలేదు. దిగువ కోర్టులో కేసు కూడా ‘తగిన సాక్ష్యాధారాలు లేనందున’ నిలువలేదు. అయితే బిల్కిస్‌ తన పోరాటాన్ని మానలేదు. మానవ హక్కుల సంఘం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించి తన కేసును సిబిఐ విచారించేలా ఆదేశాలు పొందగలిగింది. స్థానిక పోలీసులు, సిఐడిలు తనను వేధిస్తున్నందున సిబిఐ విచారణ కోరుతున్నానని ఆమె చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. సిబిఐ రంగంలో దిగిన వెంటనే బిల్కిస్‌ కేసులోని తీగలన్నీ కదిలాయి.

బిల్కిస్‌ కోల్పోయిన 13 మంది కుటుంబ సభ్యులను పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు వారిని గుర్తు పట్టకుండా తలలు వేరు చేశారని, గోరీలలోని శవాలు త్వరగా పాడయ్యేలా చేశారని, సామూహిక ఖననం చేసి కేసు ఆనవాలు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారని విచారణలో తేలింది. గుజరాత్‌లో పారదర్శకమైన న్యాయవిచారణకు అవకాశం లేనందున సుప్రీంకోర్టు విచారణను గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ బిల్కిస్‌ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేసి 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.

మే 4, 2017
బిల్కిస్‌ కేసును విచారించిన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేకకోర్టు విధించిన శిక్షనే అది బలపరిచింది. 11 మంది నిందితులు (ఒకరు మరణించారు) యావజ్జీవకారాగార శిక్ష పొందారు. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సిబిఐ వాదించగా కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ఉరిశిక్ష కోరి నేను ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకోవాలనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం. అది దక్కింది’ అని బిల్కిస్‌ పేర్కొంది. ఇన్నాళ్లు ఈ కేసు కోసం బిల్కిస్, ఆమె భర్త యాకుబ్‌ రసూల్‌ రహస్యంగా జీవిస్తూ వచ్చారు. నిందితుల వల్ల ప్రాణహాని ఉండటమే దీనికి కారణం. ఆనాడు నిందితులకు శిక్ష ఖరారు కావడంతో పాటుగా.. నేడు బిల్కిస్‌కు పరిహారంగా 50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆలస్యంగానైనా ఆమెకు పోరాటానికి గుర్తింపు దక్కిందని బిల్కిస్‌ మద్దతు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top