‘ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ’పై నేడే సుప్రీం తీర్పు

Supreme Court of India Judgment On CJI Under RTI - Sakshi

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువడనుంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు తుది తీర్పు వెలువరించనుందని సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పును, కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రజా సమాచార విభాగం అధికారి(సీపీఐవో), సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ పిటిషన్లు వేశారు. వీటిపై ఏప్రిల్‌ 4వ తేదీతో ధర్మాసనం విచారణ ముగిసింది. ‘గోప్యతా విధానాన్ని ఎవరూ కోరుకోరు. అయితే, దీనికి పరిమితులు ఉండాలి. పారదర్శకత ముసుగులో న్యాయ వ్యవస్థ నాశనం కారాదు’అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నారు. 

ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది?
‘సమాచార హక్కు చట్టం పరిధిలో సీజేఐ కార్యాలయం కూడా ఉంటుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది న్యాయమూర్తి హక్కు కాదు. అది ఆయనపై ఉంచిన బాధ్యత’అని 2010లో ఢిల్లీ హైకోర్టు 88 పేజీల తీర్పును వెలువరించింది. ఆర్టీఐ కింద జడ్జీలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలనడాన్ని అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్‌ వ్యతిరేకించారు. సీజేఐ కార్యాలయాన్ని కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన ఆర్టీఐ కార్యకర్త ఎస్‌సీ అగర్వాల్‌ తరఫున ఈ కేసును సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ధర్మాసనం ఎదుట వాదించారు. ‘ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలన్నీ పారదర్శకంగా పనిచేయాలని తరచూ చెప్పే అత్యున్నత న్యాయస్థానం తన వరకు వచ్చే సరికి వెనకడుగు వేస్తోంది.

జడ్జీలేమైనా వేరే ప్రపంచం నుంచి వచ్చారా?. ఆర్టీఐ నుంచి న్యాయ వ్యవస్థ దూరంగా ఉండటం దురదృష్టకరం, ఆందోళనకరం’ అంటూ వాదించారు. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే పాలనా వ్యవస్థ జోక్యం నుంచే తప్ప సాధారణ ప్రజల నుంచి కాదు. ప్రభుత్వ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజల కుంది’ అని ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top