నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

Supreme Court dismisses convict is juvenile claim - Sakshi

ఢిల్లీ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు సమర్థన

1న దోషుల ఉరికి మార్గం సుగమం

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషిగా ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో మైనర్‌ననీ, ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆరోపిస్తూ పవన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో పరిశీలించాల్సిన అంశాలేమీ కనబడలేదని పేర్కొంది. గతంలో పవన్‌ దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లు హైకోర్టు, ట్రయల్‌ కోర్టులలో తిరస్కరణకు గురయ్యాయని గుర్తు చేసింది.

వీటిపై వేసిన రివ్యూ పిటిషన్లను సైతం తిరస్కరించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం తగదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ..పవన్‌ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు. పవన్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి మార్గం సుగమమైంది.  

మార్గదర్శకాలు ఇవ్వాలి: నిర్భయ తండ్రి  
ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఎన్నిసార్లు పిటిషన్లు దాఖలు చేయవచ్చో తెలుపుతూ మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్భయ తండ్రి సుప్రీంకోర్టును కోరారు. నిర్ణీత సమయంలో మాత్రమే పిటిషన్లు దాఖలు చేసేలా మార్గదర్శకాలు ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. వీటివల్ల నిర్ణీత సమయంలో దోషులకు శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top