అశ్లీలత.. బీప్‌ లేకుండా బూతు డైలాగులు!

Strict Guidelines for Web Series in India Soon says IB Ministry  - Sakshi

సెన్సార్‌ కష్టాలు త్వరలో వెబ్‌ సిరీస్‌లను కూడా చుట్టుముట్టబోతున్నాయి. ఇప్పటిదాకా బుల్లితెర, వెండితెరలకు మాత్రమే పరిమితమైన సెన్సార్‌ కత్తెరలను త్వరలో వెబ్‌ సిరీస్‌కు కూడా వర్తింపజేయాలని ప్రసార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కఠినతరమైన నిబంధనలను రూపొందించబోతున్నట్లు సమాచార సాంకేతిక మరియు ప్రసారాలశాఖ ప్రకటించింది. ‘మార్గదర్శకాలు ఇప్పటికైతే ఓ కొలిక్కి రాలేదు. కానీ, వాటిని రూపొందించి వీలైనంత త్వరగా అన్వయింపజేస్తాం’ అని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. 

‘టీవీల్లో ప్రసారం అయ్యే వాటికి ఇప్పటిదాకా నిబంధనలు వర్తిస్తున్నాయి. కానీ, ఇంటర్నెట్‌ కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. అడ్డు అదుపులేకుండా మేకర్లు హింస, అశ్లీలతను చూపించేస్తున్నారు. ఇది మాములు మోతాదులో ఉంటే పర్వాలేదు. కానీ, శృతి మించిపోతోంది. బీప్‌ లేకుండా బూతు డైలాగులను వాడేస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం. అయితే నియంత్రణ పేరిట.. స్వేచ్ఛను మాత్రం హరించే ఉద్దేశం మాత్రం మాకు లేదు’ అని అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్‌ నెలలో మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో 10 మందితో కూడిన ఓ కమిటీని మార్గకదర్శకాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’  తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన ‘సాక్రెడ్‌ గేమ్స్‌’  విడుదలై.. వివాదాస్పదమైంది. నేర ప్రపంచం.. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో ఓచోట మాజీ దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయటం, కాంగ్రెస్‌ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే. విక్రమ్‌ చంద్రా నవల ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో సైఫ్‌ అలీఖాన్‌, రాధికా ఆప్టే, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు నటించగా.. అనురాగ్‌ కశ్యప్‌, విక్రమాదిత్య మోత్వానీ రూపొందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top