నగదు పరిమితి @ రూ.కోటి!

SIT on black money suggests Rs 1 crore cap on cash holdings - Sakshi

అంతకుమించితే ప్రభుత్వ స్వాధీనం

కేంద్రానికి సిట్‌ సిఫార్సు  

అహ్మదాబాద్‌: ప్రజలు గరిష్టంగా రూ.కోటి వరకూ నగదును కలిగిఉండేలా నిబంధనల్ని సవరించాలని జస్టిస్‌ ఎంబీ షా నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పరిమితిని దాటి నగదు కలిగిఉంటే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ప్రజలు గరిష్టంగా కలిగిఉండే నగదు పరిమితిని తొలుత రూ.15 లక్షలు, ఆ తర్వాత రూ.20 లక్షలకు పెంచాలని కొన్నిరోజుల క్రితం కేంద్రానికి సిట్‌ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయమై జస్టిస్‌ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలు గరిష్టంగా రూ.కోటి మేర నగదును ఉంచుకునేలా నిబంధనల్ని సవరించాలని సిఫార్సు చేశాం. ఈ పరిమితిని మించి నగదు దొరికితే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించాం’ అని చెప్పారు. ఇటీవల తమిళనాడులోని ఓ సంస్థలో ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడంపై స్పందిస్తూ.. ‘అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదును చూడండి రూ.160 కోట్లు.. 177 కోట్లు. దీనిబట్టి రూ.20 లక్షల నగదు పరిమితి ప్రయోజనకరం కాదని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. 2014లో నల్లధనం కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్‌ ఎంబీ షా(రిటైర్డ్‌) నేతృత్వంలో సిట్‌ ఏర్పాటైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top