
సాక్షి, ముంబై : మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్ ట్రెయిన్ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్‌లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అంతలో రైలు కదలగా.. తల్లి ఎక్కేసింది. అయితే తల్లిని అనుసరించే క్రమంలో పిల్లాడు కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య అతను ఇరక్కుపోగా.. అది గమనించిన సునీల్ నాపా అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ చాకచక్యంగా అతన్ని పక్కకు లాగాడు.
ఆ బాలుడిని గమనించి ముందు కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో వ్యక్తి సైతం కింద పడటం వీడియోలో గమనించవచ్చు. స్టేషన్‌లో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి మరీ బాలుడి ప్రాణాలు కాపాడిన సునీల్ నాపాపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.