‘రాక్‌స్టార్’ మోదీ! | 'Rockstar' modi! | Sakshi
Sakshi News home page

‘రాక్‌స్టార్’ మోదీ!

Sep 30 2014 1:36 AM | Updated on Apr 4 2019 3:19 PM

‘రాక్‌స్టార్’ మోదీ! - Sakshi

‘రాక్‌స్టార్’ మోదీ!

‘మేడిసన్ స్క్వేర్’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అక్కడి భారతీయులనే కాదు.. అమెరికన్ మీడియానూ ఉత్తేజపరిచినట్లు కనిపిస్తోంది.

‘మేడిసన్ స్క్వేర్’ కార్యక్రమానికి విస్తృత కవరేజ్
 
న్యూయార్క్: ‘మేడిసన్ స్క్వేర్’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అక్కడి భారతీయులనే కాదు.. అమెరికన్ మీడియానూ ఉత్తేజపరిచినట్లు కనిపిస్తోంది. అప్పటివరకు మోదీ అమెరికా పర్యటనకు అంతగా ప్రాధాన్యతనివ్వని యూఎస్ మీడియా.. కిక్కిరిసిన మేడిసన్ స్క్వేర్‌లో మోదీ ‘రాక్‌స్టార్’ ప్రదర్శనకు మాత్రం విస్తృత కవరేజ్ కల్పించింది. ‘వేలాది మంది లేచి నిల్చుని నరేంద్రమోదీ అనే ఒక సెలబ్రిటీ కాని వ్యక్తి పేరును మంత్రంలా జపిస్తూ.. మేడిసన్ స్క్వేర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు’ అని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వ్యాఖ్యానించింది. ‘ఇతర ఆసియా దేశాలు అభివృద్ధిలో దూసుకువెళ్తోంటే.. ఆ రేసులో వెనకబడిన భారత్‌ను అందుకు కారణమైన సమస్యల నుంచి గట్టెక్కించగల అపూర్వ, అసాధారణ నేతలా మోదీని భావిస్తున్న భారతీయ అమెరికన్ల ఆకాంక్షకు.. ఉత్సాహంతో ఉప్పొంగిన ఆ ప్రాంగణం దర్పణంలా నిలిచింది’ అని పేర్కొంది. ‘మేడిసన్ స్క్వేర్ గార్డెన్ సాధారణంగా బాబ్ డిలాన్, బోనో, బ్రూస్ స్పింగ్‌స్టీన్ లాంటి వినోద, సాంస్కృతిక రంగ ప్రముఖుల ప్రదర్శనలకు వేదికగా ఉంటుంది. కానీ ఆదివారం ఒక రాజకీయ ప్రముఖుడికి రాక్‌స్టార్ తరహా స్వాగతం ఇచ్చింది’ అని లాస్ ఏంజిల్స్ టైమ్స్ వ్యాఖ్యానించింది. 2008లో బరాక్ ఒబామాకు లభించిన స్థాయిలో మోదీకి భారతీయ అమెరికన్ల నుంచి ఆదరణ, విశ్వాసం లభించినట్లు ఆ దినపత్రిక పేర్కొంది.

‘ఒక వినూత్న భారత్‌ను చూపేందుకు మోదీ అమెరికా వచ్చారు. అయితే, పన్ను విధానాలు, వాతావరణ మార్పు, ఔట్‌సోర్సింగ్..తదితర అంశాలపై భారత్, అమెరికాల మధ్య ఉన్న విభేదాలను ఆయన పరిష్కరించగలరా? అన్నది వేచిచూడాలి’ అని ‘న్యూయార్క్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. అమెరికాలోని దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు మేడిసన్ స్క్వేర్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేశారు. పనిలో పనిగా.. ఆ ప్రాంగణం వెలుపలు జరిగిన మోదీ వ్యతిరేక ప్రదర్శనలనూ కవర్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement