సద్దుమణగని ‘సుప్రీం’ సంక్షోభం

'Rebel' Judges Suggest Roster Plan In Meet With Chief Justice: Sources - Sakshi

సీజేఐతో నలుగురు సీనియర్‌ జడ్జీల భేటీ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అసమ్మతి గళం వినిపించిన నలుగురు సీనియరు న్యాయమూర్తులు గురువారం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక కేసుల కేటాయింపులతో పాటు ఇతర  అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో సీజేఐ, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు సమావేశం కావడం ఇది రెండోసారి. జనవరి 12 నాటి మీడియా సమావేశంలో సీజేఐ తీరుపై నలుగురు న్యాయమూర్తులు ఫిర్యాదు చేశాక.. తొలిసారి మంగళవారం వారు భేటీ అయిన సంగతి తెలిసిందే. సీజేఐ జస్టిస్‌  మిశ్రాతో నలుగురు న్యాయమూర్తులు జస్టిస్‌ జే చలమేశ్వర్, జస్టిస్‌ గొగొయ్, జస్టిస్‌ మదన్‌ లోకూర్, జస్టిస్‌ జోసఫ్‌లు దాదాపు 15 నిమిషాలు చర్చించినట్లు తెలుస్తోంది.

నలుగురు జడ్జీలు లేవనెత్తిన డిమాండ్లు తనకు తెలుసని ఈ భేటీలో సీజేఐ చెప్పారని సుప్రీం వర్గాల సమాచారం. వారు లేవనెత్తిన అంశాలు, సలహాల్ని పరిగణనలోకి తీసుకుంటానని సీజేఐ హామీ ఇచ్చిన నేపథ్యంలో వివాద పరిష్కారంలో కొంత పురోగతి కనిపించిందని సుప్రీం వర్గాలు తెలిపాయి. తదుపరి  చర్చల్లో జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యుయు లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు కూడా పాల్గొని సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నించనున్నట్లు సమాచారం. మరోవైపు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం జస్టిస్‌ జే చలమేశ్వర్‌ చెన్నై బయల్దేరి వెళ్లారు.   

మీడియాను అడ్డుకోవాలన్న పిటిషన్‌ తిరస్కరణ
జనవరి 12 నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల లేవనెత్తి అంశాల్ని మీడియాలో ప్రచురించకుండా, చర్చించకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. సుప్రీం రిజిస్ట్రార్‌ పిటిషన్‌ను పరిశీలించి.. విచారణ సమయం కేటాయించిన అనంతరం ఆ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top