
నేడే రంజాన్ పండుగ
నేడే రంజాన్ పండుగ. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు మంగళవారం జరుపుకోనున్నారు. ‘
న్యూఢిల్లీ/వాషింగ్టన్: నేడే రంజాన్ పండుగ. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు మంగళవారం జరుపుకోనున్నారు. ‘ఈ రోజు(సోమవారం) సాయంత్రం ఏడుగంటల కన్నాముందే ఉత్తరప్రదేశ్, బీహార్‌లలోని పలు ప్రాంతాల్లో నెలవంక కనిపించింది. అందువల్ల దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్‌ను మంగళవారం జరుపుకోవాలి’ అని ఫతేపూరి మసీదు షాహీ ఇమామ్ మౌలానా ముఫ్తి మొహమ్మద్ ముఖర్రం సోమవారం ప్రకటించారు. రాష్ట్రంలోనూ నెలవంక కనపడటంతో రంజాన్ జరుపుకోవాలని భారత రయ్యతే హిలాల్ కమిటీ దక్షిణ భారత అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా షుత్తారీ ప్రకటించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు ప్రకటించారు.
విషాద పరిస్థితుల మధ్య ఈద్: ఆసియా దేశాల ముస్లింలకు ఈ రంజాన్ పర్వదినం ఉత్సాహకరంగా లేదు. విమానప్రమాదాలు, సిరియా అంతర్యుద్ధం, పశ్చిమాసియా లో దాడుల ఘటనలు ముస్లింలకు రంజాన్ వేడుకలపై నీలినీడలు పరుస్తున్నాయి.