ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని | Rajiv Gandhi Killer Nalini Released In Jail | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ హంతకురాలు నళిని పెరోల్‌పై విడుదల

Jul 25 2019 2:18 PM | Updated on Jul 25 2019 2:29 PM

Rajiv Gandhi Killer Nalini Released In Jail - Sakshi

సాక్షి, చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని ఎట్టకేలకు పెరోల్‌పై గురువారం జైలు నుంచి విడుదలైంది. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పెరోల్‌ కావాలని మద్రాస్‌ హైకోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన నళినినీ తీసుకువెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ తన కుమార్తె విషయంలో తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోయానని,  అంతేకాకుండా తండ్రి చనిపోయిన తర్వాత కూడా కుమార్తెగా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాని, పెరోల్‌ లభించిన సందర్భంగా కుటుంబాన్ని కలవడంతో పాటు కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించనున్నట్లు నళిని తెలిపింది. కాగా రాజీవ్‌ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్‌ నారాయణన్‌ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement