రాజీవ్‌ హంతకుల నిరాహార దీక్ష

Rajiv Gandhi Assassination Case Convicts Go For Hunger Strike In Jail - Sakshi

సాక్షి, చెన్నై : తమను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్‌ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ గత 12 రోజులుగా దీక్ష చేస్తుండగా, గత శనివారం నళిని ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమతో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు దీక్ష విరమించబోమని పేర్కొన్నారు. నళిని తరఫు న్యాయవాది ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో తమిళ సంఘాలు, పార్టీల్లో కలకలం రేగుతోంది.  మురుగన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడం, నళిని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో తమిళవాదుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలపై దృష్టి సారించింది. ఇక ఈ విషయమై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గవర్నర్‌కు లేఖ
తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ‘ న్యాయం కోసం అర్థిస్తున్న మాకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. 28 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం. మేము అమాయకులం. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నాం. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుంది’ అని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు.

అనంతరం మాట్లాడుతూ.. ‘ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం సబబు కాదు. కానీ నళిని విషయంలో ఇది సమర్థనీయం. రాజీవ్‌ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్‌ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిని గనుక విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా.

రాజీవ్‌ హత్యకేసు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్‌ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్‌ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు.

మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు..  జయకుమార్, రాబర్ట్‌ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్‌ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top